Begin typing your search above and press return to search.

నిర‌స‌న స‌భాస్థ‌లే.. బ‌డ్జెట్ ప్ర‌వేశానికి వేదిక‌!

By:  Tupaki Desk   |   4 Feb 2019 5:28 AM GMT
నిర‌స‌న స‌భాస్థ‌లే.. బ‌డ్జెట్ ప్ర‌వేశానికి వేదిక‌!
X
ఆమె దీదీ. ప‌శ్చిమ బెంగాల్ అన్నంత‌నే గుర్తుకు వ‌చ్చే అప‌ర‌కాళిక గుర్తుకు వ‌చ్చే తీరులో ఆమె వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తానంటే నో.. అంటే నో అన‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైన తానెంత ప‌వ‌ర్ ఫుల్ అన్న విష‌యాన్ని చూపించేందుకు వెనుకాడ‌రు. ప‌లు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల మాదిరి వేధింపుల‌కు జంక‌రు. కేంద్రం త‌న ప‌వ‌ర్ ను చూపిస్తానంటే లైట్ తీసుకునే ఆమె.. తేడా వ‌స్తే వీధి పోరాటానికైనా రెఢీ అన్న విష‌యాన్ని తాజా ఉదంతంతో చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఒక మ‌హాన‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కోసం ఒక పెద్ద రాష్ట్రానికి చెందిన బ‌ల‌మైన ముఖ్య‌మంత్రి వీధుల్లోకి వ‌స్తారా? అంటే.. రార‌ని చెబుతారు. కేంద్రంతో త‌క‌రారు ఎందుక‌ని వెన‌క‌డుగు వేస్తారు. కానీ.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త అలా కాదు. ఏ రాష్ట్రంలోనూ క‌నిపించ‌ని సీన్ ను.. మ‌రీ ముఖ్యంగా సినిమాల్లో కూడా ఇప్ప‌టివ‌ర‌కూ రాని స‌న్నివేశాన్ని కోల్ క‌తా మ‌హాన‌గ‌రం సాక్షిగా దేశ ప్ర‌జ‌ల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేశారు మ‌మ‌త‌.

మోడీతో పెట్టుకుంటే అంతేన‌న్న‌ట్లుగా ఉండే సీన్ కు కొత్త స‌న్నివేశాన్ని జోడించే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రితోనైనా పెట్టుకో మోడీ.. నాతో కాద‌న్న హెచ్చ‌రిక‌ను త‌న తాజా చర్య‌తో చెప్పేశారు. కోల్ క‌తా పోలీస్ క‌మిష‌న‌ర్ ను ప్ర‌శ్నించ‌టానికి వ‌చ్చిన సీబీఐ అధికారుల్ని అడ్డుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. వారిని తీసుకొని పోలీసు జీపులో ప‌డేసి (ఇంచుమించు) పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లటం ద్వారా.. సీబీఐ అధికారుల‌కు సైతం షాకిచ్చారు.

తమ‌కు చిత్తం వ‌చ్చిన‌ట్లుగా ఏ రాష్ట్రానికైనా వెళ్లి.. ఏదేదో చేసేయొచ్చు కానీ ప‌శ్చిమ‌బెంగాల్ లో మాత్రం అలా సాధ్యం కాద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అంతేనా.. సీబీఐ అధికారుల స్థాయికి స్థానిక పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారో.. కేంద్రానికి.. మ‌రీ ముఖ్యంగా త‌న దందుడుకు చ‌ర్య‌ల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు నిద్ర ప‌ట్ట‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించే మోడీ మాష్టారికి బ‌ల‌మైన హెచ్చ‌రిక త‌ర‌హాలో సందేశాన్ని పంపారు.

త‌మ పోలీసు ఉన్న‌తాధికారిని ప్ర‌శ్నించేందుకు త‌గిన ప‌త్రాలు తీసుకురాకుండా వ‌చ్చిన సీబీఐ అధికారుల‌కు షాకిచ్చిన మ‌మ‌త స‌ర్కారు.. అదే సీబీఐకి కోల్ క‌తాలో ఉన్న భ‌వ‌నం చుట్టూ స్థానిక పోలీసుల్ని చుట్టుముట్ట‌టం ద్వారా ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్సుక‌త‌ను పెంచారు. వ‌రుస షాకుల‌తో అర్థం కాని కేంద్రం.. ఆ వెంట‌నే సీబీఐ భ‌వ‌నంలోకి స్థానిక పోలీసులు వెళితే ప‌రువు పోతుంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. వెంట‌నే కేంద్ర బ‌ల‌గాల్ని భ‌వ‌నం వ‌ద్ద‌కు హుటాహుటిన పంపారు.

నా బంగారు పుట్ట‌లో వేలి పెడితే కుడ‌తానే త‌ప్పించి.. అన‌వ‌స‌రంగా నేనెవ‌రి జోలికి వెళ్ల‌న‌న్న సందేశాన్ని ఇస్తూ.. కేంద్ర బ‌ల‌గాలు సీబీఐ కార్యాల‌యానికి చేరుకున్న వెంట‌నే.. స్థానిక పోలీసులు అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌టం ద్వారా తామేమిట‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు మ‌మ‌త‌. అయితే.. ఆమె వెన‌క్కి త‌గ్గ‌టానికి కార‌ణం లేక‌పోలేదు.. ఏ మాత్రం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించినా.. కేంద్రానికి ఉండే విశేష అధికారంతో రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న పెట్టే వీలు ఉండ‌టంతో.. తెగే వ‌ర‌కూ అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

అలా అని వెన‌క్కి త‌గ్గితే దీదీ స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే.. రాత్రి వేళ రోడ్డు మీద‌కు వ‌చ్చిన మ‌మ‌త నేరుగా పోలీస్ క‌మిష‌న‌ర్ నివాసానికి వెళ్లి.. మ‌నోధైర్యాన్ని అందించ‌ట‌మే కాదు.. న‌డి రోడ్డు మీద నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక్క‌డితో ఇష్యూ ముగిసింద‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. తాను నిర‌స‌న చేస్తున్న ప్రాంతం నుంచే సోమ‌వారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా తృణ‌మూల్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు (సోమ‌వారం) బెంగాల్ అంత‌టా ఆందోళ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదే స‌మ‌యంలో మ‌మ‌త తాను ప్ర‌వేశ పెట్టాల్సిన రాష్ట్ర బ‌డ్జెట్ ను తాను నిర‌స‌న చేస్తున్న ప్రాంతం నుంచే ప్ర‌వేశ పెట్ట‌టం ద్వారా.. మ‌రో అరుదైన స‌న్నివేశానికి తెర తీస్తున్నార‌ని చెప్పాలి. ఆమె అంద‌రికి దీదీ. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు.. త‌న‌ను వేధించాల‌నుకున్న వారికి మాత్రం ఆమె దాదానే.