Begin typing your search above and press return to search.

చంద్రబాబును గుర్తుకు వచ్చేలా చేసిన దీదీ!

By:  Tupaki Desk   |   22 Aug 2019 8:01 AM GMT
చంద్రబాబును గుర్తుకు వచ్చేలా చేసిన దీదీ!
X
పరిస్థితులు గతంలో మాదిరి లేవు. ప్రజల్లోనూ అవగాహన అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రజల్ని ఆకట్టుకోవటానికి హడావుడి చేసే పనుల కారణంగా పొలిటికల్ మైలేజీ తర్వాత.. లేనిపోని తిప్పలు ఎదురుకావటం అప్పుడప్పుడు జరుగుతున్నదే. ఎందుకిలా? అంటే.. సదరు అధినేతల్లో కమిట్ మెంట్ లేకపోవటంలో.. రీల్ స్టార్స్ కు మించినట్లుగా ఈ రియల్ స్టార్లు నటించే ప్రయత్నం చేసి.. ప్రజలకు దొరికిపోవటమే దీనికి కారణంగా చెప్పాలి. టీడీపీ అధినేత కమ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచార కాంక్ష ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన పొలిటికల్ కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా పరిమిత మీడియా ఉందన్నట్లుగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తుంటారు. ఏదైనా ఫోటోకు ఫోజిచ్చి.. పండగ చేసుకోండి.. ఈ రోజు మీకు ఫస్ట్ పేజీ ఫోటో ఇచ్చా.. మీరెంతలా వాడతారో రేపు పేపర్లో చూస్తానన్న షాకింగ్ వ్యాఖ్యలు బాబు సొంతం. పేపర్లోనూ.. టీవీలోనూ కనిపించే బాబుకు.. ఆయన రియల్ గా వ్యవహరించే తీరుకు చాలానే తేడా ఉంటుందని చెప్పక తప్పదు.

ఉన్నట్లుండి బాబును ఎందుకు గుర్తు చేసుకుంటున్నారన్నది చూస్తే.. దానికి కారణం లేకపోలేదు. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రచారం మీద మనసైంది. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేయటం.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మీద ఘీంకరించిన దీదీకి దెబ్బ పడేట్లుగా బెంగాల్ ప్రజలు తీర్పు ఇవ్వటంతో ఆమె కాస్త వెనక్కి తగ్గారు. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ తప్పించి.. రాష్ట్రానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొద్ది నెలల్లో రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో తేడా కొడితే.. జరిగే నష్టం ఆమెకు తెలియంది కాదు. అందుకే మోడీకి మించిన రీతిలో ఆమె తన ప్రచారాన్ని మార్చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా చిన్న చిన్న దుకాణాల వద్దకు వెళ్లి ప్రజల్ని ఆకట్టుకునే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా ఒక చిన్న హోటల్ కు వెళ్లిన ఆమె.. అక్కడి వారికి తానే స్వయంగా టీ పెట్టటమే కాదు.. ఒక చిన్నారిని ఎత్తుకొని ఆడించే ప్రయత్నం చేశారు. సదరు చిన్నారిని తల్లికి అప్పజెప్పిన తర్వాత ఆ షాపులో వేలాడదీసిన రూ.5 స్నాక్స్ పాకెట్ ఇచ్చి మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. కాకుంటే.. దానికి డబ్బులిచ్చినట్లుగా కనిపించలేదు.

దగ్గర దగ్గర ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను నిశితంగా చూస్తే.. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఉంటుందే తప్పించి.. ఎక్కడా మనస్ఫూర్తిగా చేసిన వైనం కనిపించదు. ఇదంతా చూస్తే.. ప్రచారం కోసం చంద్రబాబు మెకానికల్ గా చేసేలా దీదీ కనిపిస్తారు. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే.. ప్రజల విషయంలో నిజాయితీ ఉంటే సరిపోతుంది. అదే.. ప్రజల్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ విషయం దీదీ లాంటి వారికి ఎప్పటికి అర్థమవుతుందో?