Begin typing your search above and press return to search.

ఒంటికాలితో ఎన్నికల ప్రయాణం

By:  Tupaki Desk   |   4 May 2021 7:31 AM GMT
ఒంటికాలితో ఎన్నికల ప్రయాణం
X
మామూలుగా అయితే ఒంటిచేత్తోనే గెలిపించారని చెప్పటం మామూలే. కానీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ సాధించిన విజయాన్ని మాత్రం ఒంటికాలితో సాధించారని చెప్పటమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా మమత ఒంటికాలితోనే చేశారుకాబట్టే. తాను పోటీచేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన రోజే మమత కాలికి బలమైన గాయమైంది. దాని కారణంగా దీదీ రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సొచ్చింది.

అనేక ఎక్సరేలు, స్కానింగుల తర్వాత డాక్టర్లు దీదీ కాలికి బలమైన గాయం అయ్యిందని తేల్చారు. కొద్దిరోజుల పాటు కాలు కదిపేందుకు లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఎడమకాలికి పెద్ద కట్టు కూడా కట్టేశారు. దాంతో రెండురోజుల పాటు ఆసుపత్రికే పరిమితమైపోయిన దీదీ మూడో రోజు మాత్రం జనాల్లోకి వచ్చేశారు. అప్పటికే రెండురోజులు వేస్టయ్యిందనే భావనలో ఉన్న మమత అప్పటినుండి కాలికి కట్టుతోనే ప్రచారంలో పాల్గొన్నారు.

ఎక్కడ ప్రచారం చేసిన కాలికి కట్టు కారణంగా వీల్ ఛైర్లోనే తిరిగారు. రోడ్డుషోల్లో పాల్గొన్న మమత వీల్ చైర్లో కూర్చునే షో చేశారు. ఆమెతో పాటు మిగిలిన నేతలు, కార్యకర్తలంతా నడిచారు. ఎక్కడైనా నడవాల్సొచ్చిపుడు మాత్రం సహాయకుల సాయంతో ఒంటికాలిపైనే నడిచారు. వేదికలమీదకు ఎక్కాల్సొచ్చినపుడు కూడా ఎవరో ఒకరి సాయంతోనే ఎక్కేవారు. చివరకు ప్రచారంలో భాగంగా ఫుట్ బాల్ ను చేతులతోనే పట్టుకుని యువత మీదకు విసిరారు. మామూలుగా అయితే ఫుట్ బాల్ ను తంతారు. కానీ మన దీదీ కాలుకి కట్టున్న కారణంగా చేతితో పట్టుకుని విసిరారు. బెంగాల్లో ఫుట్ బాల్ ఆటకు విపరీతమైన క్రేజుంది.

రోడ్డుషో చేసినా, బహిరంగసభల్లో కనిపించినా కాలికి కట్టుతోనే కనబడేవారు. తన కాలికట్టు జనాలకు బాగా కనబడేట్లుగా దీదీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తంమీద దీదీ ఎంత పాపులర్ అయ్యార్ దీదీ కాలికట్టు కూడా అంతే పాపులరైంది. అందుకనే ప్రత్యర్ధులందరినీ మట్టి కరిపించిన కారణంగానే ఎన్నికలను దీదీ ఒంటికాలితో గెలిపించారని చెప్పటమే సబబుగా ఉంటుంది.