Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు మ‌మ‌త దూరంగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌దేనా?

By:  Tupaki Desk   |   22 July 2022 4:42 AM GMT
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు మ‌మ‌త దూరంగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌దేనా?
X
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిర్ణ‌యించారు. దీనిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు మీడియాలో వెలువ‌డుతున్నాయి. విప‌క్షాల త‌ర‌ఫున ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వాను ప్ర‌క‌టించేముందు మమ‌త‌ను సంప్ర‌దించ‌లేద‌ని.. అందుకే ఆమె ఆగ్ర‌హంగా ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు తాము దూరంగా ఉంటామ‌ని ఆమె ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేసిన య‌శ్వంత్ సిన్హా తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థే. 22 పార్టీల విప‌క్ష కూట‌మి త‌ర‌ఫున ఆయ‌న‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డంతో కీల‌క పాత్ర పోషించింది.. ప‌లుమార్లు ఇందుకోసం విప‌క్షాల‌తో ఢిల్లీలో స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌లో ముఖ్య పాత్ర పోషించింది కూడా మ‌మ‌తా బెన‌ర్జీయే. అలాంటిది ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎంపిక చేయ‌డంపై మ‌మ‌త కినుక వ‌హించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించ‌డానికి ముందు మ‌మ‌తా బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమ‌య్యారు. ఎంపీలంతా మమతా బెనర్జీని సంప్రదించకుండా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించిన‌ట్టు స‌మాచారం.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా గిరిజ‌న వ్య‌క్తిని, అది కూడా మ‌హిళ‌ను ఎంపిక చేస్తే మ‌మ‌త.. ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని బీజేపీ రాజ‌కీయంగా ప్ర‌చారం చేస్తోంది. మ‌మ‌త‌.. ఆదివాసీలు, గిర‌జ‌నులు, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు వ్య‌తిరేక‌మ‌ని ఫ్లెక్సీల‌తో బెంగాల్ లో ప్ర‌చారం చేసింది.

దీంతో మమ‌త కొంత ఇబ్బందుల్లో ప‌డ్డారు. అలాగే ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ ను ప్ర‌క‌టించింది. జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ ఓబీసీ అభ్య‌ర్థి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను వ్య‌తిరేకించ‌కుండా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచి ప‌ద్ధ‌తి అని మ‌మ‌త భావించిన‌ట్టు తెలుస్తోంది.

కాగా ఆగస్టు 6న ఉపపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే నెల 10న ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది.