Begin typing your search above and press return to search.

దాడులా.? ఆధారాలున్నాయా - మమతా బెనర్జీ

By:  Tupaki Desk   |   2 March 2019 5:56 AM GMT
దాడులా.? ఆధారాలున్నాయా - మమతా బెనర్జీ
X
ఏదైనా కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడడం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలవాటు. అందరూ ఒకదారి.. తానొక్కత్తినే మరొక దారి అన్నట్లుగా బిహేవ్‌ చేస్తుంటారు ఆమె. ఇక మోదీ ప్రభుత్వం అంటే ఒంటికాలిపై లేస్తారు. ఆయన విధానాల వల్లే దేశం నాశనం అయిపోతుందని ఆరోపిస్తుంటారు. అవకాశం వస్తే థర్డ్‌ ఫ్రంట్‌ కి నేతృత్వం వహించి ప్రధాన మంత్రి కూడా కావాలని అనుకుంటున్నారు దీదీ. అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రానికి చుక్కలు చూపించే దీదీ.. ఇప్పుడు మరో బాంబ్‌ పేల్చారు. మన యుద్ధ విమానాలు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ దాడులు చేశాయని చెప్తున్న కేంద్రం.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు.

“మన యుద్ధ విమానాలు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోకి వెళ్లి దాడులు చేసి దాదాపు 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్తోంది. దానికి ఏవైనా ఆధారాలు అంటే ఫోటోలు - వీడియోలు ఏమైనా ఉన్నాయి. మన విమానం కూలిపోయిన అభినందన్‌ పాకిస్తాన్‌ లో పడిపోయాడు. వాళ్లు వీడియో రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత అభినందన్‌ ను రిలీజ్‌ చేశారు. పాకిస్తాన్‌ చెప్పినదానికి ఆధారాలు ఉన్నాయి. కానీ మీరు చెప్తున్నదానికే ఆధారాలు లేవు.అందుకే ఆధారాలు కావాలని డిమాండ్‌ చేస్తున్నాం. మీరు ఎలాంటి దాడులు చేయకుండా.. అటవీ ప్రాంతంలో బాంబులు వేసొచ్చి.. వాటిని మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారని మాకు అనుమానం వస్తోంది. అందుకే.. ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేస్తున్నా” అన్నారు మమతా బెనర్జీ. ఒక్క మమతాబెనర్జీయే కాదు.. చాలామంది లీడర్ల మనసులో ఇదే అభిప్రాయం ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేదు. దీదీ మాత్రం నిర్మొహమాటంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. మరి దీదీ డిమాండ్‌ ను కేంద్రం అంగీకరిస్తుందో లేదో చూడాలి.