Begin typing your search above and press return to search.

మండ‌లికి వెళ్తున్న మ‌మ‌త.. 50 ఏళ్ల క్రితమే ర‌ద్దు!

By:  Tupaki Desk   |   18 May 2021 12:30 PM GMT
మండ‌లికి వెళ్తున్న మ‌మ‌త.. 50 ఏళ్ల క్రితమే ర‌ద్దు!
X
ప‌శ్చిమ బెంగాల్ లో ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో త‌న పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ.. తాను మాత్రం ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే.. రాజ్యాంగం ప్ర‌కారం రాబోయే ఆర్నెల్ల‌లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి, చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగు పెట్టాల్సి ఉంది. మ‌మ‌త ఎన్నిక‌ల్లో నిల‌వ‌డానికి ప‌లు స్థానాల్లో అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఊహించ‌ని విధంగా ఆమె కొత్త‌దారిని ఎంచుకున్నారు.

ఎప్పుడో యాభై సంవ‌త్స‌రాల క్రితం ర‌ద్దైపోయిన మండ‌లి వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ విధంగా.. తాను ఎమ్మెల్సీ హోదాలో ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డానికి చూస్తున్నారు. ఆర్నెల్ల‌లో త‌న అభ్య‌ర్థిత్వం నిరూపించుకోవాల్సి ఉన్నందున‌.. శ‌ర‌వేగంగా ఈ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది.

బెంగాల్లో 1952లో మండ‌లి వ్య‌వ‌స్థ మొద‌లైంది. అయితే.. 1969లో అప్ప‌టి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత నుంచి కేవ‌లం శాస‌న‌భ మాత్ర‌మే మ‌నుగ‌డ‌లో ఉంది. అయితే.. ఇప్పుడు చాలా కోణాల‌ను ప‌రిశీలించిన మ‌మ‌త‌.. మండ‌లిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గం ఆమోదించింది. ఇక‌, ఏర్పాటే త‌రువాయి. మండ‌లి ఏర్పాటు ద్వారా కేవ‌లం త‌న అవ‌స‌రం తీర‌డ‌మే కాకుండా.. పార్టీలోని అసంతృప్తుల‌కు, సీనియ‌ర్ నేత‌లకు సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు మ‌మ‌త‌.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మొద‌టి శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నుంది టీఎంసీ. శాస‌న‌స‌భ‌లో ఉన్న బ‌లం మేర‌కు.. విప‌క్ష బీజేపీ మ‌ద్ద‌తు లేకుండానే మ‌మ‌త మండ‌లిని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. అయితే.. శాస‌న‌స‌భ ఆమోదించిన బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర‌వేయాల్సి ఉంది. మ‌రి, ఈ విష‌యంలో కేంద్రం ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.