Begin typing your search above and press return to search.

ఢిల్లీలో మమత బిజీ.. సోనియా సహా పలువురితో భేటీలు

By:  Tupaki Desk   |   28 July 2021 2:43 PM GMT
ఢిల్లీలో మమత బిజీ.. సోనియా సహా పలువురితో భేటీలు
X
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీని ఢీకొట్టడం ఎలా అని ప్రతిపక్షాలు అన్నీ ఆలోచిస్తున్న వేళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మునుపటి బలం కోల్పోతున్న వేళ మమతా బెనర్జీ ఆ పార్టీని బలోపేతం చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను అడ్డుకోవడానికి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

2023 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం.. దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే ఎజెండాగా మమతా బెనర్జీ రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. కానీ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురించి ఎదగలేకపోతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దూరం పెట్టకుండా ఆ పార్టీని కలుపుకు పోయే ఎత్తుగడను మమతా బెనర్జీ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ తాజాగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిశారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో మోడీ-అమిత్ షాలను ఎదురించి నిలబడ్డ నాయకురాలిగా మమతా బెనర్జీ ఫోకస్ అయ్యారు. దేశంలో బీజేపీ వ్యతిరేకులకు ఆశాకిరణంలా కనపడ్డారు. దీంతో జాతీయ స్థాయిలో కూటమికి ఆమెనే నాయకురాలిగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కూటమికి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తూ.. శరద్ పవార్ ను సమన్వయకర్తగా చూస్తూ.. మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ కిషోర్ పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగి సోనియాతో భేటి అయ్యారు.

మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ప్రతిపక్ష సభ్యులందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. విపక్ష సభ్యులతోపాటు ప్రధాని మోడీతో కూడా ఆమె భేటి అయ్యారు. మూడోసారి సీఎంగా ాధ్యతలు చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ 'సోనియా నన్ను చాయ్ తాగడానికి ఆహ్వానించారని.. రాహుల్ కూడా అక్కడే ఉన్నారని.. రాజకీయ పరిస్థితులపై చర్చించామని' తెలిపారు. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకం కావాలని భావిస్తున్నామన్నారు.

పెగాసస్, కోవిడ్ పరిస్థితులతోపాటు ప్రతిపక్షాల ఐక్యత లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయని మమతా బెనర్జీ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సమావేశంతో సత్ఫలితాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నానని మమతా ప్రకటించారు.ఇక పెగాసస్ వివాదంపై కూడా మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తన ఫోన్ కూడా హ్యాక్ అయ్యిందని.. ఇది ఎమర్జెన్సీ కన్నా చాలా తీవ్రమైన విషయం అని ' మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది హైలోడ్ గల వైరస్ అని.. మన భద్రత, రక్షణ ప్రమాదంలో పడ్డాయని తెలిపారు.

సోనియాగాంధీ కూడా ప్రతిపక్షాల ఐక్యతనే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ విశ్వసిస్తోందని.. ఆ పార్టీని ప్రాంతీయ పార్టీలు విశ్వసిస్తాయని మమత బెనర్జీ భావిస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఓ ప్రత్యామ్మాయ కూటమికి మమతా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సోనియాతో భేటి అయినట్టు తెలుస్తోంది. ఈ ఫ్రంట్ కు సోనియాగాంధీ కూడా సుముఖంగా ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.