Begin typing your search above and press return to search.

మమత మొదలెట్టేసింది..

By:  Tupaki Desk   |   2 Aug 2018 4:33 AM GMT
మమత మొదలెట్టేసింది..
X
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో హల్‌ చల్ చేస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆమె ప్రధాన పార్టీల నేతలతో భేటీ అవుతూ జాతీయ రాజకీయాల్లోకి వేగంగా దూసుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం వచ్చే ఏడాది జనవరి 19న నిర్వహించే ర్యాలీకి అందరినీ ఆహ్వానించేందుకు కలుస్తున్నానని ఆమె చెబుతున్నా ఆ మాట నిజం కాదని ఇట్టే అర్థమవుతోంది. ఇంకా ఆర్నెళ్ల టైమున్న ర్యాలీకి ఇప్పటి నుంచి పిలుపులెందుకు అన్న ప్రశ్న అందరి మదిలోనూ తలెత్తుతోంది. కేవలం వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రధాని రేసులో నిలవడమే లక్ష్యంగా - అందుకు అన్ని పార్టీలనూ ముందే సిద్ధం చేయడానికి ఆమె రాజకీయం నెరపుతున్నారని వినిపిస్తోంది.

అయితే.. మమత మాత్రం ప్రధాని పదవిపై తనకు ఆసక్లి లేదంటూ చెబుతున్నారు. ఆ పదవి విషయంలో తాను ఎవరికీ పోటీ కాదని అంటున్నారు. ఆమె మాటలు అలా ఉన్నా రాజకీయంగా వేస్తున్న అడుగులు మాత్రం ఆ కుర్చీవైసే కదులుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. బుధవారం ఆమె కాంగ్రెస్‌ తో పాటు వేర్వేరు పార్టీల నేతలను ఆమె కలిశారు. తెదేపా - వైకాపా - డీఎంకే - ఆర్జేడీ - ఎస్పీ - జేడీ(ఎస్‌) పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. జనవరి 19న కోల్‌ కతాలో జరిగే బహిరంగ సమావేశానికి వారిని ఆహ్వానించారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా వచ్చే ఏడాది జనవరి 19న తాను చేపట్టబోయే మెగా ర్యాలీకి మద్దతుగా రావాలని కోరుతూ వివిధ పక్షాల నేతలను కలిసినట్లు చెప్పారు. ప్రతిపక్షాలన్ని టినీ ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించగా.. అందరినీ కలవడం తన బాధ్యత అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రధాని పదవిపై నాకు ఆసక్తి లేదు. అన్ని పార్టీలు జట్టుగా ఉంటే చూడటమే ఇష్టం. పీఎం ఎవరన్నది అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తాయి అని విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు.

కాగా బుధవారం పార్లమెంటులోని టీఎంసీ కార్యాలయం - విపక్ష నేతల తాకిడితో హడావుడి కనిపించింది. మరోవైపు మమత.. అద్వానీని ఆయన ఛాంబర్‌ లో కలిశారు. దాదాపు 20 నిమిషాలు చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే. అద్వానీ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కలిశాను అని తెలిపారు. ఆ తర్వాత సోనియాగాంధీ - రాహుల్‌ గాంధీతోనూ సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. 2019 ఎన్నికల్లో కలసి పోటీచేసే విషయంపై చర్చించామని అన్నారు. ఎన్‌ఆర్‌సీ ఆంశం కూడా ప్రస్తావించామని చెప్పారు. జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ - ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ - సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ ను కలిశారు. అనంతరం బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌ - కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌ - అహ్మద్‌ పటేల్‌ - సమాజ్‌ వాదీ పార్టీ నేత రామ్‌ గోపాల్‌ యాదవ్‌ లతో పార్లమెంటులోని టీఎంసీ కార్యాలయంలో ఆమె చర్చించారు. ఎన్డీయే మిత్రపక్షం శివసేనకు చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా మమతతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది.

కాగా మమత రెండు రోజుల్లోనే ఇంత దూకుడు చూపడం.. వివిధ పార్టీలను తనకు సానుకూలంగా మార్చుకోవడంతో సోనియా - రాహుల్ గాంధీల్లో ఒకవైవపు సంతోషం, ఒకవైపు దు:ఖం కలుగుతున్నాయట. మోదీని ఢీకొట్టడానికి మమత మంచి అస్త్రం కానుందన్న సంతోషం ఒకటైతే... ఆమె ఇలాగే దూసుకెళ్తే తన కుమారుడికి ప్రధాని పదవి దక్కడం కష్టమేనన్న భయంతో వస్తున్న దు:ఖం కూడా ఎక్కువవుతోందట.