Begin typing your search above and press return to search.

మ‌మ‌త వ‌ర్సెస్ మోడీ.. మ‌ళ్లీ ఫైట్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   6 May 2021 2:30 PM GMT
మ‌మ‌త వ‌ర్సెస్ మోడీ.. మ‌ళ్లీ ఫైట్ త‌ప్ప‌దా?
X
ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్క‌డం ఖాయ‌మైంది. ఎన్నిక‌ల‌కు ముందు.. ఏ రేంజ్‌లో అయితే.. ఇక్క‌డ అధికార పార్టీ తృణ‌మూల్‌కు, బీజేపీకి మ‌ధ్య వివాదాలు, విభేదాలు.. సాగాయో.. ఇప్పుడు మ‌ళ్లీ అంత‌కుమించిన వివాదాలు సాగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చ‌మ‌టోడ్చింది. బెంగాల్ పీఠంపై క‌మ‌ల వికాసం సాధించి తీరుతామ‌న్న నాయ‌కులు.. అన్ని శ‌క్తుల‌ను ఒడ్డారు. అయితే.. ప్ర‌జాతీర్పు మాత్రం దీనికి భిన్నంగా సాగింది. మ‌ళ్లీ మ‌మ‌తాబెన‌ర్జీకే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌గ్గాలు అప్ప‌గించారు.

అయితే.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో అయినా.. మారాల్సిన బీజేపీ పెద్ద‌లు.. పైకి స‌హ‌క‌రిస్తామ‌ని చెబుతూనే.. లోలోన మాత్రం దీదీని ఇరుకున పెట్టాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ `ఎన్నిక‌ల హింస‌`ను తెర‌మీదికి తెచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. నాలుగో ద‌శ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రంలో పోలీసులు కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. అప్ప‌ట్లో మీరంటే మీరేన‌ని ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న టీఎంసీ.. బీజేపీ నేత‌లు.. ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు మౌనంగా ఉండిపోయారు.

కానీ, ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల హింస‌పై కేంద్రం హుటాహుటిన స్పందించింది. వాస్త‌వానికి ఇలాంటి సంఘ ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు మేర‌కు కేసున‌మోదు చేయ‌డం.. త‌ద్వారా విచా ర‌ణ‌కు ఆదేశించ‌డం అనేది ప‌రిపాటి. కానీ, ఇక్క‌డ కేంద్ర హోం శాఖే రంగంలోకి దిగిపోయింది. బంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై కేంద్రం చర్యలకు పూనుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ.

హింస చెలరేగడానికి కారణాలను శోధించే ఈ బృందానికి హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారని కేంద్రం తెలిపింది. వీరంతా బంగాల్కు బయలుదేరారని వెల్లడించింది. బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ పరిణామాలపై నివేదిక పంపాలని బంగాల్‌ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే సమగ్ర నివేదికను మ‌మ‌త‌ సర్కార్ పంపించలేదని కేంద్రం తెలిపింది. నివేదిక పంపకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన హింస‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు ఆధారంగా జ‌రగాల్సిన విచార‌ణ‌ను ఉన్న‌ప‌ళాన కేంద్రం త‌న చేతిలోకి తీసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో మ‌మ‌త మ‌ళ్లీ త‌న‌దైన గ‌ళం వినిపించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధికారాల‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని. రాష్ట్రంపై కేంద్రం పెత్త‌నం చేసేందుకు రెడీ అవుతోంద‌ని ఆమె ఇప్ప‌టికే ఆరోపించిన నేప‌థ్యంలో తాజా ప‌రిణామం.. మ‌రింత‌గా ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదాన్ని పెంచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.