Begin typing your search above and press return to search.

హమ్మయ్య... చంద్రబాబునూ పిలిచారు

By:  Tupaki Desk   |   8 Oct 2018 6:14 AM GMT
హమ్మయ్య... చంద్రబాబునూ పిలిచారు
X
దేశంలో నాకంటే సీనియర్ నేతలెవరూ లేరని చెప్పే చంద్రబాబును కొన్నాళ్లుగా రీజినల్ పార్టీల నేతలు పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ తారగా భావించే తృణమూల్ అధినేత మమతా బెనర్జీ అయితే చంద్రబాబును పట్టించుకోలేదు. కేసీఆర్ - ఆమె కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ కు ప్లాన్ చేసినప్పుడు కూడా చంద్రబాబును కనీసం పలకరించలేదు. అప్పటికి చంద్రబాబు మోదీ కూటమిలో ఉండడంతో ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లలేదు. దీంతో పూర్తిగా చంద్రబాబు రీజినల్ ప్లేయర్‌ గానే మిగిలిపోయారు.

అయితే... ఇప్పుడు చంద్రబాబు - మోదీ మధ్య విరోధం పీక్ స్టేజికి చేరడంతో ప్రత్యామ్నాయ కూటములుకు ప్రయత్నించే నేతల దృష్టి చంద్రబాబుపై పడింది. అందులో భాగంగానే తాజాగా మమతా బెనర్జీ వచ్చే ఏడాది ప్రారంభంలో తాను తలపెట్టబోయే భారీ ర్యాలీకి రావాలంటూ చంద్రబాబును ఆహ్వానించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల శక్తి ఏపాటిదో ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని మమత పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ ర్యాలీ మంచి వేదిక అవుతుందని మమత అభిప్రాయపడ్డారు.

దేశ చరిత్రలోనే ఎన్నో కీలక సమావేశాలకు సాక్షీభూతంగా నిలిచిన కోల్‌ కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద జనవరి 19న ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్టు మమత తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను - సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని తాను భావిస్తున్నట్టు మమత వివరించారు. ఇక్కడి నుంచే ప్రతిపక్షాల స్వరాన్ని వినిపిద్దామని కోరారు.