Begin typing your search above and press return to search.
మోదీ ప్రసంగానికి మమత మోకాలడ్డుతోందే!
By: Tupaki Desk | 9 Sep 2017 11:29 AM GMTదేశాన్ని పురోభివృద్ధిలో నడిపించేందుకు సాధారణ విద్యలతోపాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యావశ్యమని బోధించిన స్వామి వివేకానంద.. అమెరికాలో పర్యటించి 124 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1893 - సెప్టెంబరు 15న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సభల్లో వివేకానంద పాల్గొని ప్రసంగించారు. అప్పట్లో ఆయనకు ఆ సభావేదికపై కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. అసలు.. ఇంత చిన్నవాడు ఏం చెబుతాడు? అని అందరూ కరివేపాకు మాదిరిగా తీసిపడేశారు. అలాంటి సమయంలో.. తన వాగ్ధాటిని ప్రదర్శించి, తన విజ్ఞాన సముపార్జనా సింధువును ప్రసరింప జేసిన వివేకానందుని చూసి ఒక్క అమెరికానే కాదు.. యావత్ ప్రపంచం జేజేలు పలికింది.
అందరూ`` లేడీస్ అండ్ జంటిల్ మన్ `` అని తమ ప్రసంగాన్ని ప్రారంభిస్తే.. వివేకానందుడు మాత్రం.. ఈ యావత్ సృష్టిలో.. ఆడ మగ కాదు.. ``సోదరులు - సోదరీమణులే `` ఉంటారని చాటిచెపుతూ.. ``మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా`` అని తన ప్రసంగాన్ని ప్రారంభించడం చరిత్రను తిరిగి లిఖించింది. ఇప్పుడా ప్రసంగం 124 ఏళ్లు పూర్తి చేసుకుని.. 125వ ఏట అడుగిడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రధాని నరేంద్ర మోదీ.. వివేక స్పూర్తితో నిద్రాణమై ఉన్న జాతిని మేలుకొలిపేందుకు ప్రసంగించాలని నిర్ణయించారు.
ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు - కళాశాలల్లో ప్రసారం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశించింది. అయితే ఈ ప్రసంగాన్ని పశ్చిమ బెంగాల్‌లోని విద్యాలయాల్లో ప్రసారం చేయబోమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధ ఛటర్జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి ప్రసంగాలను ప్రసారం చేయలేమని కోల్ కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. యూజీసీ నోటీసుల మేరకు పశ్చిమ బెంగాల్ లోని కళాశాలలు - విశ్వవిద్యాలయాలు విద్యాశాఖను ఆశ్రయించాయని, అయితే యూజీసీ నోటీసులను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని వారికి స్పష్టం చేసినట్లు మంత్రి తెలియజేశారు.
దీంతో మోదీ ప్రసంగానికి మమతా బెనర్జీ ఇలా మోకాలడ్డారని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి విషయాల్లోనూ రాజకీయాలకు చోటివ్వడం దారుణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వివేకానందుకు ఒకపార్టీ వారు, ఒక వక్తికి సొంతమైన వారు కాదన, ప్రపంచ అభ్యున్నతిని కోరుకున్న మహాపురుషుడని, ఆయన స్ఫూర్తి అందరికీ కావాల్సిందేనని చెబుతున్నారు. మరి మమత మారతారో లేదో చూడాలి.