Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆఫీసు ఎదుటే పురుగుల మందు తాగాడు

By:  Tupaki Desk   |   22 May 2015 6:03 PM GMT
కేసీఆర్ ఆఫీసు ఎదుటే పురుగుల మందు తాగాడు
X
ఒక ఉద్య‌మ పార్టీగా ప్ర‌జ‌ల భావోద్వేగాల గురించి టీఆర్ఎస్ నేత‌ల‌కు మించి మ‌రెవ‌రికీ బాగా తెలీదేమో. ప్ర‌భుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు.. అనుకున్న‌ది సాధించేందుకు ఆత్మార్ప‌ణ‌మే మార్గ‌మ‌న్న విధానానికి కొంత‌మేర సానుకూల స్పంద‌న వ్య‌క్తం చేసిన టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే వ్య‌వ‌హారాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం కానీ కొలువు తీరితే.. కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాల్ని ప‌ర్మినెంట్ చేస్తాన‌ని కేసీఆర్ హామీ ఇవ్వ‌టం తెలిసిందే. అయితే.. కేసీఆర్ సీఎం ప‌ద‌విలోకి వ‌చ్చి ఏడాది గ‌డుస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ దాని మీద ఎలాంటి నిర్ణ‌యం తీసుకోని నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కార్యాల‌య భ‌వ‌నం ఎదుట ఒక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశారు.
మిర్యాల‌గూడ విద్యుత్తు స‌బ్‌స్టేష‌న్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ప‌ని చేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తి.. శుక్ర‌వారం తెలంగాణ స‌చివాల‌యంలోని సీఎం కార్యాల‌యం ఉండే స‌మ‌త బ్లాక్ భ‌వ‌నం ఎదుట పురుగుల మందు తాగాడు. త‌న ఉద్యోగాన్ని పొడిగించ‌నందుకు నిర‌స‌న‌గా ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో.. స్పందించిన అక్క‌డి పోలీసులు అత‌న్ని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌రి.. ఇలాంటి వ్య‌వ‌హారాల మీద అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.