Begin typing your search above and press return to search.

పానీపూరిలో ఉల్లి వేయలేదని తల పగలగొట్టాడు

By:  Tupaki Desk   |   1 Jan 2020 4:59 AM GMT
పానీపూరిలో ఉల్లి వేయలేదని తల పగలగొట్టాడు
X
ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరల కారణంగా కొత్త లొల్లి మొదలైంది. ఉల్లి ధరలు పెరిగిన కారణంగా చాలా చోట్ల గొడవలకు కారణమవుతోంది. దడ పుట్టించే ఉల్లి ధరలతో హోటళ్లు.. పానీ పూరీ దుకాణాలతో పాటు.. చాలా ఫుడ్ కోర్టులలో ఉల్లిని ఆచితూచి అన్నట్లు వాడుతున్నారు. ఉల్లితో తినటం అలవాటున్న వారు.. ధరలు పెరిగిన వేళ.. ఎప్పటిలా కాకుండా ఆచితూచి అన్నట్లు ఉల్లిని వాడటంతో వినియోగదారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తాజాగా ఇలాంటి ఉదంతమే హైదరాబాద్ లోని అమీర్ పేటకు సమీపంలో చోటు చేసుకుంది.

పానీ పూరీలో ఉల్లి వేయని వ్యవహారంలో మాటా మాటా పెరిగి చివరకూ తల పగిలే వరకూ వచ్చింది. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్ లో ఆటో డ్రైవర్ వీరన్న పానీ పూరీ తినేందుకు ఛాట్ బండార్ కు వెళ్లాడు. రూ.10 పానీ పూరీ తినే సమయంలో ఉల్లి అడిగితే వేయలేదు. ఉల్లిముక్కలు ఎందుకు వేయవని ఆటో డ్రైవర్ అడిగితే.. ఉల్లిపాయలు వేసేందుకు నువ్వేమైనా బిర్యానీ ఆర్డర్ చేశావా? అంటూ బదులిచ్చాడు.

దీంతో మాటా మాటా పెరిగింది. తాను డబ్బులు ఇవ్వనని ఆటో డ్రైవర్ తేల్చారు. డబ్బులు ఇవ్వకుండా వెళుతున్న ఆటో డ్రైవర్ ను పానీ పూరీ దుకాణం దారుడు ఆపి చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆటో డ్రైవర్ ఆటోలోని ఇనుప రాడ్ తో పానీ పూరీ దుకాణందారు మీద దాడి చేశాడు. దీంతో.. తల పగలటంతో పాటు.. కంటి వద్ద గాయమైంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరిపైనా కేసు పెట్టి స్టేషన్ కు తరలించారు. ఉల్లి ముక్కలు ఎంత పని చేశాయి?