Begin typing your search above and press return to search.

రాహుల్ సభలో తుపాకీ కలకలం

By:  Tupaki Desk   |   19 Sept 2015 4:53 PM IST
రాహుల్ సభలో తుపాకీ కలకలం
X
రాహుల్‌ ఎన్నికల ప్రచార సభలో ఓ వ్యక్తి తుపాకీతో తిరగడం కలకలం రేపింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చంపారంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటుండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే ఓ వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. అతని వద్ద సోదా చేయగా తుపాకీ బయటపడింది. దీంతో బెంబేలెత్తిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. బీహార్ లో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండడంతో ప్రజల్లో చాలామంది వద్ద తుపాకీలు ఉండడం సర్వసాధారణమే.. తన వద్ద ఉన్న తుపాకీని రక్షణ కోసం తెచ్చుకున్నాడా... లేదంటే వేరే కుట్ర ఏమైనా ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. ఇంత భారీ బందోబస్తు ఉన్నా... భద్రతా ఏర్పాట్లు ఉన్నా తుపాకీతో వచ్చాడంటే మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ కి అనుకోని పరాభవం ఎదురైంది. బీహార్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పటికీ గ్రాండ్ అలయెన్స్ భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, జేడీయూలు ఈ సభకు దూరంగా ఉన్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు రాహుల్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

రాహుల్ గాంధీతో ప్రచార వేదికను పంచుకునేందుకు లాలూ, నితీశ్ లు సుముఖంగా లేరన్న రెండుమూడు రోజులుగా కథనాలు వస్తున్నాయి. వారు రాహుల్ సభకు హాజరుకారంటూ ముందునుంచే ఊహాగానాలు వచ్చాయి. అవి ఇప్పుడు నిజమయ్యాయి.