Begin typing your search above and press return to search.

నగరంలో కేటుగాడు.. ఐటీ సంస్థ నిర్వాహాకుడిని బురిడీ కొట్టించి రూ. 28 లక్షలు స్వాహా..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 8:45 AM GMT
నగరంలో కేటుగాడు.. ఐటీ సంస్థ నిర్వాహాకుడిని బురిడీ కొట్టించి రూ. 28 లక్షలు స్వాహా..!
X
హైదరాబాద్ లో కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహాకులను చాలా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సైబర్ మాయగాళ్లు.. మరోవైపు మాయమాటలు చెప్పే కేటుగాళ్లు ఐటీ సంస్థల నిర్వాహకులు.. ఉద్యోగులను టార్గెట్ చేస్తుండటంతో ఇటీవలి కాలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట తరుచూ వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఓ యువకుడు తన తండ్రి అనంతపురం వైసీపీలో ఎమ్మెల్సీ అని.. తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహాకుడి నుంచి ఏకంగా రూ. 28 లక్షలు స్వాహా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అమీర్ పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను 28ఏళ్ల యువకుడు నడిపిస్తున్నాడు. అతనికి గతేడాది జూలైలో ఓ వ్యక్తి పరిచయం అయ్యారు. అతడి వయస్సు సుమారు 30 ఏళ్లు. కాగా ఆ వ్యక్తి తన తండ్రి అనంతపురంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారని.. తాను సైతం వైస్ఆర్టీపీ హైదరాబాద్ నగర పార్టీకి కాబోయే అధ్యక్షుడినని జీపీఎస్ ఇన్ఫోటెక్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు.

తనకు జీపీఎస్ ఇన్ఫోటెక్ ఆఫీసులో కొంత భాగాన్ని అద్దెకివ్వాలని కోరగా నిర్వాహకుడు అంగీకరించాడు. ఈ మేరకు 40వేల అడ్వాన్స్ నెలకు 15వేల అద్దెతో కార్యాలయంలో కొంత భాగాన్ని అతడికి అద్దెకు ఇచ్చాడు. వీరిద్దరి సుమారు ఒకే వయస్సు కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇదే అదునుగా భావించిన అద్దెకు ఉన్న వ్యక్తి ఐటీ నిర్వాహకుడి నుంచి 86వేల అప్పుగా తీసుకున్నాడు. మరోసారి తన తండ్రి పేరు చెప్పి తనకు ఏపీ.. తెలంగాణలో భారీగా ఆస్తున్నాయని నమ్మబలికించాడు.

ఈ క్రమంలోనే విడతల వారీగా ఐటీ నిర్వాహకుడి నుంచి 26 లక్షల 95వేలు అప్పు గా తీసుకున్నాడు. అయితే ఈ డబ్బును ఎంతకీ తిరిగి చెల్లించకపోవడంతో అనుమానంతో ఆ వ్యక్తి గురించి ఆరా తీశాడు. దీంతో ఆ వ్యక్తి అమీర్ పేటలోని అంకమ్మ బస్తీలో నివాసం ఉంటాడని తెలుసుకున్నాడు. అతడి కుటుంబం సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడుతుందని తెలుసుకొని విస్తుపోయాడు.

ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొని ఎఎస్సాఆర్ నగర్ పోలీసులకు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరీ ఐటీ నిర్వాహాకుడి డబ్బులను పోలీసులు ఏమాత్రం రికవరీ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే..!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.