Begin typing your search above and press return to search.

హోదా కోసం ఆంధ్రోడి ఆత్మ‌బ‌లిదానం!

By:  Tupaki Desk   |   20 Aug 2018 10:02 AM GMT
హోదా కోసం ఆంధ్రోడి ఆత్మ‌బ‌లిదానం!
X
ప్రాణం ఎవ‌రిదైనా ఒక్క‌టే. అదేం దుర‌దృష్ట‌మో కానీ.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఆత్మ‌బ‌ల‌దానాల విష‌యంలో మీడియా.. రాజ‌కీయ వ‌ర్గాలు స్పందించిన దానితో పోలిస్తే.. ఆంధ్రోళ్ల త్యాగాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌ని చెప్పాలి. రాష్ట్రాన్ని విభ‌జించ‌కుండా క‌లిపే ఉంచాలంటూ చేసిన త్యాగాల మీద కానీ.. ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా హామీపై హ్యాండ్ ఇచ్చిన ఉదంతంపై తీవ్ర ఆగ్ర‌హంతో చేస్తున్న ప్రాణ‌త్యాగాల‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌ని ప‌రిస్థితి.

ఏపీకి హోదా విష‌యంలో జ‌రిగిన అన్యాయంపై ఏపీకి చెందిన ఒక‌రు తాజాగా ఆత్మ బ‌లిదానాల‌కు పాల్ప‌డ్డారు. త‌న సూసైడ్ లెట‌ర్ లో ప్ర‌ధాని మోడీ చేసిన మోసాన్ని ప్ర‌స్తావించారు. తాను హోదా కోస‌మే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో పైడికొండ‌ల యానాద‌య్య అనే 47 ఏళ్ల వ్య‌క్తి పురుగుమందు తాగి సూసైడ్ చేసుకున్నారు.

ఇత‌డి వివ‌రాల్ని చూస్తే.. యానాద‌య్య‌ది క‌డ‌ప జిల్లాగా గుర్తించారు. భార్య ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ప‌దేళ్ల క్రితం ఒంగోలుకు వ‌చ్చి న‌గ‌రంలోని క‌మ్మ‌పాలెంలో ఉంటున్నాడు. సిమెంటు కొట్లో గుమ‌స్తాగా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాను హోదా కోసమే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లుగా లేఖ‌లో ప్ర‌స్తావించారు బాధితుడి జేబులో ల‌భించిన లేఖ ఈ నెల ఆరో తేదీన రాసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి రాసిన ఈ లేఖ‌లో.. త‌న‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. కేంద్రం ఏపీ ప‌ట్ల చిన్న‌చూపు చూస్తుంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం ఏపీని చిన్న‌చూపు చూస్తోంద‌ని..క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌కు పంపార‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని ఎదురుచూసిన వారిని మోసం చేస్తూ అన్యాయం చేశార‌న్నారు.

త‌న బ‌లిదానంతో అయినా కేంద్రం దిగి వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయం త‌న పిల్ల‌ల‌కు జ‌ర‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లుగా పేర్కొన్నాడు. హోదా అంశంపై నాయ‌కులంతా క‌లిసి పోరాడాల‌ని సూచించాడు. త‌న కుటుంబాన్ని రాష్ట్ర స‌ర్కారు ఆదుకోవాల‌ని కోరాడు. హోదా కోసం ప్రాణాలు అర్పించిన యానాద‌య్య క‌ల‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.