Begin typing your search above and press return to search.

చావు నరకం చూపించిన చికెన్ ఫ్రైడ్ రైస్

By:  Tupaki Desk   |   26 Aug 2015 3:31 AM GMT
చావు నరకం చూపించిన చికెన్ ఫ్రైడ్ రైస్
X
నోరూరించే చికెన్ ఫ్రైడ్ రైస్.. ఒక వ్యక్తిని చావు దగ్గరగా తీసుకెళ్లి.. నరకం అనుభవించేలా చేసింది. వైద్యులు సకాలంగా స్పందించటంతో పెను ప్రమాదం నుంచి బయటపడిన ఘటన తాజాగా బయటకొచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు.

అయితే.. అతనికిచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ లో మూడు సెంటీమీటర్ల పొడవున్న సన్నని ప్లాస్టిక్ తీగ ఆహారంతో పాటు పొట్టలోకి వెళ్లిపోయింది. అయితే.. అది కాస్తా మెడ ఎముక నుంచి వెన్నుముక లోపలికి జారి అక్కడ చిక్కుకుపోయింది.

దీంతో.. గొంతుకు ఏదో అడ్డుపడినట్లుగా అనిపించిన ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. చివరకు ఆహారం కూడా తీసుకోలేని దుస్థితి. దీంతో.. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లి చూపించుకున్నా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఇలా రెండు వారాలు నరకయాతనకు గురైన సదరు వ్యక్తి.. హైదరాబాద్ కు వచ్చి ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించుకున్నారు.

సందేహం వచ్చిన వైద్యులు స్కానింగ్ తీయగా.. వెన్నుముక ప్రాంతంలో ఏదో చిక్కుకుందన్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అది ప్లాస్టిక్ తీగగా గుర్తించి.. ఓ ఆర్మ్ అనే త్రీడీ ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా వెన్నుముకలో చిక్కుకున్న సదరు తీగముక్కను శస్త్రచికిత్స ద్వారా బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉండటంతోపాటు.. అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఇలాంటి సమస్యలు చికెన్ లాంటి నాన్ వెజ్ ఐటెమ్స్ తినే సమయంలో చిన్నారులు.. పొరపాటున చిన్న చిన్న ఎముకలు మింగేసినప్పుడు ఏర్పడుతుంటాయని.. ఆహారాన్ని సంప్రదాయబద్ధంగా శుభ్రంగా కడుక్కున్న చేత్తో తింటే.. స్పర్శతో ఇలాంటి ప్లాస్టిక్ ముక్కల్ని గుర్తించే వీలుందని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాలకే ముప్పని వైద్యులు చెబుతున్నారు. చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో కానీ.. నరకం అంటే ఏమిటో చూడాల్సి వచ్చిందని సదరు వ్యక్తి ఆవేదన చెందాడు.