Begin typing your search above and press return to search.

‘రైస్ పుల్లింగ్’ మెషీన్ అంటూ 4కోట్లు నొక్కేశారు

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:35 AM GMT
‘రైస్ పుల్లింగ్’ మెషీన్ అంటూ 4కోట్లు నొక్కేశారు
X
ఆ మధ్యన పరమాన్నం బాబా ఉదంతం తెలిసిందే. హ్యారీ పోటర్ పుస్తకాన్ని పూజలో పెట్టి.. డబ్బుల్ని డబుల్ చేస్తానంటూ బురిడీ కొట్టించటం.. బాధితుడిగా లైఫ్ స్టైల్ భవన యజమాని ఉండటం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం విన్న వారంతా అంత పెద్దమనిషి అత్యాశకు ముక్కున వేలేసుకునే పరిస్థితి. డబ్బంటే మరీ అంత అత్యాశేంటి? అన్న వాదన వినిపించింది. ఊరికే వచ్చి పడే డబ్బంటే ఎవరికి ఆశ ఉండదన్నట్లుగా ఉంది తాజా యవ్వారం చూస్తే. డబ్బుకు డబుల్ చేస్తామంటూ మాయ మాటలు చెప్పే దానికి తగ్గట్లే.. తమ అద్భుతమైన రైస్ దగ్గర పుల్లింగ్ యంత్రం ఉందంటూ మాయ మాటలు చెప్పి రూ.4కోట్లు నొక్కేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ కు చెందిన దామోదర్ రెడ్డి అనే వ్యాపారిని కర్ణాటకకు చెందిన కోహ్లీ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. తన దగ్గర అద్భుతాలు సృష్టించే రైస్ పుల్లింగ్ పాత్ర ఉందని.. దాంతో ఏదైనా చేయొచ్చంటూ నమ్మబలికాడు. ఈ బౌల్ దగ్గర ఉంటే అదృష్టం వరిస్తుందని.. డబ్బులు డబుల్ చేయొచ్చంటూ మాయమాటలు చెప్పాడు. దీన్ని నమ్మిన దామోదర్ రెడ్డి రూ.4కోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి అడ్రస్ లేకుండా పోవటంతో దామోదర్ రెడ్డి సీఐడీ పోలీసుల్ని ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరిపి.. బురిడీ కోహ్లీ కోసం తీవ్రంగా గాలించారు.ఎట్టకేలకు కోహ్లీని.. అతని అనుచరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్భుతాలు జరుగుతాయంటూ మాయమాటలు చెప్పే వారి మాటల్ని విని మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరెన్ని హెచ్చరికలు చేసినా.. మాయదారి డబ్బులు వచ్చి మీద పడతాయంటే చాలు వెనుకా ముందు చూసుకోకుండా మోసపోవటం ఈ మధ్యన మరీ ఎక్కువైందనే చెప్పాలి.