Begin typing your search above and press return to search.

8 మందిని చంపేసిన సీరియల్ కిల్లర్...!

By:  Tupaki Desk   |   28 Oct 2019 6:37 AM GMT
8 మందిని చంపేసిన సీరియల్ కిల్లర్...!
X
ప్రస్తుత రోజుల్లో మోసపోయేవారి కంటే మోసం చేసేవారే ఎక్కువగా ఉన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ మద్యే జరిగిన కొన్ని సంఘటనలని చూస్తే పరిచయం లేని వ్యక్తులతోనే కాదు ...ఇంట్లో వారితోను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థమౌతుంది. కేరళలో జాలీ అనే మహిళ తమ ఆరుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన ఘటనే దీనికి నిదర్శనం. ఈ ఘటన గురించి మరచిపోకమునుపే ..ఆంధ్రప్రదేశ్‌ లోనూ అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ వ్యక్తి ముందు స్నేహం చేసి నమ్మకం పెంచుకొని ..ఆ తరువాత డబ్బు కోసం వరుస హత్యలకు పాల్పడ్డాడు.

పూర్తి వివరాలని ఒకసారి చూస్తే ...ఏలూరు అశోక్‌ నగర్‌ లోని కేపీడీటీ స్కూల్‌ లో పనిచేసే పీఈటీ నాగరాజు అక్టోబర్ 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించదు. ఆయన్ని గుర్తించిన స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగరాజు గుండెపోటుతో చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. అయితే, ఆయన వెంట తీసుకెళ్లిన రూ. 2 లక్షల నగదుతోపాటు ఒంటి మీద ఉన్న బంగారం కూడా మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నాగరాజు గుండెపోటుతో కాదు విషప్రయోగంతో చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది.

దీనితో పోలీసులు తమదైన శైలిలో కేసుని విచారించడం మొదలుపెట్టారు. మృతుడి కాల్ డేటా ప్రకారం విచారణ ప్రారంభించారు. దీనితో అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి విచారించారు. పోలీసుల విచారణలో తానే ఆ నేరం చేసినట్లు అంగీకరించాడు. అలాగే నాగరాజుతో పాటు మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేసినట్లు పోలీసులకి చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఏలూరు హనుమాన్ నగర్‌ కు చెందిన ఈ నిందితుడు తన బంధువులు - పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని పూజల పేరిట నమ్మించేవాడు. ఆ పూజ చేస్తే మంచిది ..ఈ పూజ చేస్తే నీకు లాభం చేకూరుతుంది అని నమ్మించేవాడు. ఆ పూజలు చేసిన తరువాత కూడా వారి పరిస్థితి మారకపోవడంతో అతడ్ని నిలదీసేవారు. అప్పుడు కూడా ఎదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మరోసారి మోసం చేసి ఎదో ఒక గుడికి తీసుకువెళ్లి ప్రసాదం లో విషం కలిపి ... దేవుడి ప్రసాదం అంటూ వారిచేత తినిపించేవాడు. అది దేవుని ప్రసాదమే కదా అని తిన్నవారు విషం కలిపి ఉండటంతో అక్కడే ప్రాణాలు వదిలేవారు. ఆ తరువాత వారి దగ్గర ఉన్న డబ్బు ..వంటిపై ఉన్న బంగారం తీసుకోని వెళ్లిపోయేవాడు. ఇలా ఏలూరులో ముగ్గురిని - కృష్ణా - తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం ఎనిమిది మందిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.