Begin typing your search above and press return to search.

మ‌నోడి నిర్వాకం..పోలీస్‌ స్టేష‌న్‌ ను త‌న‌ఖా పెట్టేశాడు

By:  Tupaki Desk   |   3 May 2018 3:59 PM GMT
మ‌నోడి నిర్వాకం..పోలీస్‌ స్టేష‌న్‌ ను త‌న‌ఖా పెట్టేశాడు
X

అవాక్క‌య్యే రీతిలో బ్యాంక్‌ ల‌కు ప‌లువురు టోక‌రా వేస్తున్న సంగతి తెలిసిందే. వేల‌కోట్ల రూపాయ‌లు బ్యాంకులకు టోక‌రా పెడుతున్న ఉదంతం మ‌నం చూస్తున్నాం. అయితే అప్పు కావాల్సి వస్తే ఏ పొలమో.. ఇల్లో.. బండో.. బంగారమో తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుంటాం.. లేదా స్నేహితులదో.. బంధువులదో స్థలాలు, ఇల్లు పెట్టి అప్పు తీసుకుంటాం.. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే షాక్ అవుతారు. వాళ్లవి.. వీళ్లవి కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఎంజాయ్ చేశాడు.. అది కూడా బ్యాంకులో.. ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిన విషయం.. ఇప్పుడు వెలుగులోకి రావటంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఇంత‌టి ఘ‌నుడిది కర్నూలు జిల్లా. ఈయన పేరు టి.నాగేశ్వరరావు. అందరూ నాగేష్ నాయుడు అంటారు. ఇతను గోనెగండ్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్. ఇతని భార్య పుష్పావతి ప్రస్తుతం సర్పంచ్. 1993 సంవత్సరంలో నాగేష్ నాయుడికి డబ్బుల అవసరం వచ్చింది. దీంతో గోనెగండ్లలోని 106 - 35 - 114 - 452 సర్వే నెంబర్లపై సహకార సంఘం మార్ట్ గేజ్ కింద రూ.10వేల అప్పు తీసుకున్నాడు. అందులో పోలీస్ స్టేషన్ కూడా ఉండటం విశేషం. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 452లో పోలీస్ స్టేషన్ తోపాటు పోలీస్ శాఖకు కేటాయించిన 4.13 ఎకరాల భూమి కూడా ఉంది. వీటిని గోనెగండ్ల సింగిల్ విండో ద్వారా కోడుమూరు కేడీసీసీ బ్యాంక్ నుంచి రూ.10వేలు తీసుకున్నాడు నాగేష్ నాయుడు. కొన్నాళ్ల క్రితం ఈ అప్పులను రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. అయితే మార్ట్ గేజ్ లోన్ కు చెందిన ఒప్పందాన్ని కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రద్దు చేయించలేదు. దీంతో ఆ అప్పు అలాగే ఉండిపోయింది. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఇటీవల పోలీస్ శాఖ సిబ్బంది క్వార్టర్స్ పున:నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈసీ తీయించారు. పోలీస్ స్టేషన్ తోపాటు ఆ స్థలం కూడా తాకట్టు ఉందని తెలిసి షాక్ అయ్యారు. విషయంపై విచారణ చేస్తే.. గోనెగండ్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంజ్ నిర్వాకం అని తేలింది. ఈ తతంగంపై కేసు నమోదు చేసి.. నిందితుడుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ను తాకట్టు పెట్టి మరీ బ్యాంక్ అప్పు తీసుకోవటం బహుశా దేశంలో ఇదే కావొచ్చు అంటున్నారు..