Begin typing your search above and press return to search.

నాకు క‌రోనా ఉంది.. విమానం గాల్లోకి లేస్తుండ‌గా చెప్పిన పాసింజ‌ర్‌.. ఓరినాయ‌నా..

By:  Tupaki Desk   |   6 March 2021 1:30 AM GMT
నాకు క‌రోనా ఉంది.. విమానం గాల్లోకి లేస్తుండ‌గా చెప్పిన పాసింజ‌ర్‌.. ఓరినాయ‌నా..
X
అప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలియ‌దు.. అప్పుడే ఎందుకు నోరు విప్పాడో తెలియ‌దు.. మొత్తానికి అస‌లు విష‌యం మాత్రం చెప్పేశాడు.. ‘‘మేడం.. అయామ్ కొవిడ్ ఎఫెక్టెడ్‌’’ అంటూ ఎయిర్ హోస్టెస్ చెవిలో ఊదేశాడు ఓ ప్రయాణికుడు!

అంతేకాదు.. ప్ర‌యాణికుల మేలు కోస‌మే తాను చెప్తున్నాన‌ని, ఫ్లైట్ ఆపాలంటూ టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో కోర‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో.. విమానంలోని అంద‌రికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాసేపు ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఎవ్వ‌రికీ. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఎయిర్ హోస్టెస్‌.. కాక్ పీట్ లోని పైల‌ట్ కు విష‌యం చెప్పి అల‌ర్ట్ చేసింది.

దీంతో.. ఫ్లైట్ ఆపేశారు పైల‌ట్స్‌. ఆ త‌ర్వాత అత‌ను కూర్చున్న సీటు కు మూడు వ‌రుస‌ల్లోని ప్రేక్ష‌కుల‌ను వెంట‌నే అప్ర‌మ‌త్తం చేశారు. వారిని విమానంలోని కంటైన్ మెంట్ ఏరియాకు త‌ర‌లించారు. ఇటు కొవిడ్ పాజిటివ్ గా చెప్పిన వ్య‌క్తిని దింపేసి, ఢిల్లీలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఆ త‌ర్వాత ప్ర‌యాణికులంద‌రికీ పీపీఈ కిట్లు అంద‌జేశారు. అనంత‌రం సీట్ల‌న్నింటినీ పూర్తిగా శానిటైజ్ చేశాక విమానం బ‌య‌ల్దేరింది. ఇంత‌కీ.. ఇదెక్క‌డ జ‌రిగిందో చెప్ప‌లేదు క‌దూ! ఇదంతా.. ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో చోటు చేసుకుంది. అంతా ఓకే అనుకున్న త‌ర్వాత బ‌య‌ల్దేరిందీ విమానం. ‘‘ఓర్నీ బండబడ‌.. ఎంత టెన్ష‌న్ పెట్టావురా సామీ..’’ అనుకుంటూ వెళ్లిపోయారు ప్ర‌యాణికులు.