Begin typing your search above and press return to search.

విడాకులు ఇచ్చిందని ఎంత దారుణంగా చంపేశాడంటే?

By:  Tupaki Desk   |   6 Aug 2021 12:59 AM GMT
విడాకులు ఇచ్చిందని ఎంత దారుణంగా చంపేశాడంటే?
X
ఈ మధ్యన వస్తున్న మార్పుల్ని గమనించారా? ప్రాణంగా ప్రేమించామని చెబుతారు. ఆ ప్రేమ సఫలం కాకుంటే కసిగా మారటం.. దారుణంగా హతమార్చటం ఈ మధ్యన ఎక్కువైంది. విపరీతంగా ప్రేమించిప్పుడు కోపానికి అంతకు మించిన క్రోధానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? కానీ.. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత.. పరస్పర అంగీకారంతో విడిపోయిన భార్యను మాజీ భర్త దారుణంగా హతమార్చిన దారుణం గుజరాత్ లో చోటు చేసుకుంది. ఈ ఉదంతం గురించి పూర్తిగా తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేం. ఇంతకూ అసలేం జరిగిందంటే?

అహ్మదాబాద్ లోని వత్వా అనే ప్రాంతానికి చెందిన అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యాక ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నుంచి భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో విసుగు చెందిన హేమ.. భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు చోటు చేసుకునేవి. ఇదే సమయంలో మహేశ్ అనే వ్యక్తితో హేమకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది.
దీంతో.. కోర్టును ఆశ్రయించి భర్తకు విడాకులు ఇచ్చింది. వారిద్దరి పిల్లల్ని భర్త వద్ద వదిలేసి.. మహేశ్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరూ కలిసి ఉంటున్నారు.

భార్య దూరమైన తర్వాత నుంచి మానసికంగా కుంగిపోయాడు అజయ్. పిల్లల్ని తనకు వదిలేసి.. హేమ వెళ్లిపోయిందని మదనపడేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో సతమతమయ్యేవాడు. దీంతో.. మాజీ భార్యపై కసి.. కోపం అంతకంతకూ ఎక్కువ అయ్యాయి. తన దుస్థితికి హేమ కారణమని బలంగా నమ్మేవాడు.

దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలనుకునేవాడు. ఇందులో భాగంగా తన స్నేహితుల్లో కొందరిని తీసుకొని మాజీ భార్య హేమ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె భర్త లేని సమయాన్ని చూసుకొని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన వెంటనే ఆమెపై దాడికి యత్నించాడు. దీంతో.. భయపడిన ఆమె అతడ్ని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ.. అజయ్ స్నేహితులు ఆమెను అడ్డుకున్నారు. హేమను వెంటాడిన అజయ్.. ఆమెను పట్టుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో 27సార్లు పొడిచేశాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మరణించింది. అనంతరం తన దారిన తాను వెళ్లిపోయాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అజయ్.. తన భార్య దారుణంగా హత్యకు గురై పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ భర్త పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.