Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో భార‌త న‌కిలీ వైద్యుడి రికార్డ్

By:  Tupaki Desk   |   9 March 2017 5:52 PM GMT
ఆస్ట్రేలియాలో భార‌త న‌కిలీ వైద్యుడి రికార్డ్
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులపై పెద్ద ఎత్తున విశ్వ‌స‌నీయ‌త ఉన్న స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో మ‌న దేశానికి చెందిన ఓ వ్య‌క్తి ప‌రువుతీసే ప‌నిచేశాడు. ఏకంగా 11 ఏళ్ల‌పాటు ఆ దేశంలోని న్యూ సౌత్ వేల్స్ లో న‌కిలీ ప‌త్రాల‌తోనే వైద్యుడిగా ప‌నిచేశాడు. బండారం బ‌య‌ట‌ప‌డ‌టంతో ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. ఆస్ట్రేలియా అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం శ్యామ్‌ ఆచార్య అనే వ్య‌క్తి సారంగ్‌ చితాలే అనే భారతీయ వైద్యుడి విద్యార్హ‌త‌లు స‌హా ఇత‌ర‌ ప‌త్రాల‌ను దొంగ‌లించాడు. తన బ‌దులుగా సారంగ్‌ పేరునే ఉపయోగించి భారత పాస్‌పోర్టు, నకిలీ ఎంబీబీఎస్‌ డిగ్రీ కూడా సంపాదించాడు. వీటి ఆధారంగా 2003లో నైపుణ్యం గల ఉద్యోగుల వలసల కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా నిర్వహించినపుడు న్యూ సౌత్‌వేల్స్‌ ఆరోగ్య విభాగంలో ఉద్యోగం సంపాదించాడు.

కొద్దికాలం త‌ర్వాత అక్క‌డ స్థిర‌ప‌డి ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే 2003 నుంచి 2014 వరకు 11 ఏళ్లపాటు వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు. అనంత‌రం 2016లో నోవాటెక్‌ అనే ఔషధ పరిశోధన సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఎందుకో ఆ సంస్థ యాజమాన్యానికి శ్యామ్‌ గుర్తింపు పత్రాలపై అనుమానం వ‌చ్చింది. దీంతో కూపీ లాగారు. త‌ద్వారా విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వారు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ప్రస్తుతం శ్యామ్ ఆచార్య ప‌రారీలో ఉన్నాడు.