Begin typing your search above and press return to search.

బూటు వేసిన నేరం ఓకే..చావగొట్టిన వారి సంగతేంటి?

By:  Tupaki Desk   |   25 March 2016 5:31 AM GMT
బూటు వేసిన నేరం ఓకే..చావగొట్టిన వారి సంగతేంటి?
X
ఒకరు ఒక తప్పు చేశారని.. దాన్న సాకుగా చేసుకొని అత్యంత దారుణంగా దాడి చేస్తే చట్టం ఏం చేయదా? చేష్టలుడిగినట్లుగా ఉండిపోతుందా? తప్పు చేసిన వారి మీద చుట్టూ ఉన్న వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చర్యలు తీసుకోవటం సరైనదేనా? అన్న ప్రశ్నలు రేకెత్తించేలా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఢిల్లీ జేఎన్ యూ నేత కన్నయ్య కుమార్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సభను ఏర్పాటు చేశారు.

ఈ సభకు హాజరైన బీజేపీ అనుబంధం సంస్థల్లో ఒకటైన గో సంరక్షణ దళ సభ్యులు నరేశ్.. పవన్ కుమార్ రెడ్డిలు కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బూటు విసిరారు. ఆ వెంటనే.. ఆయన చుట్టూ ఉన్న వారు దారుణంగా వారిద్దరిపై దాడి చేశారు. కన్నయ్య మీద బూటు విసరటాన్ని ఎవరూ సమర్థించరు. అది సరైన పద్ధతి అని కానీ.. నిరసన తెలియజేయటానికి సరైన విధానమని ఎవరూ చెప్పరు.

బూటు విసిరి వారిద్దరూ తప్పు చేయటం ఒక ఎత్తు అయితే.. వారి మీద చుట్టూ ఉన్న వారు చేయి చేసుకున్న విధానం చూస్తే విస్మయం చెందాల్సిందే. బూటు విసిరటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పిడిగుద్దులు గుద్దటమే కాదు.. టీవీ మీడియా ప్రతినిధులు వినియోగించే కెమేరా స్టాండ్లను తీసుకొని వారిని చితకబాదిన వైనం విస్మయానికి గురి కాక తప్పదు. బూటు విసిరినందుకు రక్తం కారేలా కొట్టేయటం సరైనదేనా? అన్నది ప్రశ్నగా మారింది. మరి.. దీనికి సమాధానం చెప్పే వారెవరు..?