Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ ముందు ఆ పెద్దాయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు?

By:  Tupaki Desk   |   15 Nov 2019 10:28 AM GMT
ప్రగతిభవన్ ముందు ఆ పెద్దాయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు?
X
తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పాలన ఎలా సాగుతోంది? అన్న ప్రశ్నకు సమాధానంగా పలువురు ఆందోళనకారులు మొదలుకొని ఉద్యమకారుల వరకూ అంతా.. ఉమ్మడి రాష్ట్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరి అస్సలు లేరన్న మాట తరచూ వినిపిస్తున్న దుస్థితి.

తెలంగాణలో ఇప్పుడంతా బలమున్నోడిదే తప్పించి.. బక్కజీవి బతకలేని పరిస్థితి. ఇదే విషయాన్ని గుర్తు చేసేలా.. ఈ రోజు (శుక్రవారం) సీఎం అధికార నివాసమైన ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. సూసైడ్ చేసుకోబోయిన వ్యక్తిని చూసి అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. ఇంతకీ ఎవరాయన? ఎందుకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు? అన్నది చూస్తే..

మంచిర్యాల జిల్లాకు చెందిన రవీందర్ స్థానికంగా కేబుల్ ఆపరేటర్ గా ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల పొలం అమ్మి కేబుల్ నెట్ వర్క్ నడుపుకునేవారు. అయితే.. ఓ రౌడీషీటర్ అతని కేబుల్ కనెక్షన్లను లాగేసుకున్నట్లు రవీందర్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. తనకు చెందిన భూమిని సైతం ఆక్రమించినట్లు చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై స్థానిక ఎమ్మెల్యే మొదలుకొని అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.

ఇలాంటివేళ.. తనకు ఆత్మహత్యకు మించిన మార్గం మరోదారి లేదన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ సాధన సమయంలో తాను చాలా చురుగ్గా పని చేశానని.. తమ జిల్లాలో సీఎం కేసీఆర్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నట్లు చెప్పాడు. అంతేనా.. సారు మీద తనకున్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా ఆయన పేరును చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మరి.. అలాంటి వీరాభిమానికి తెలంగాణ రాజ్యంలో ఇన్ని సమస్యలేంది సీఎం సాబ్?