Begin typing your search above and press return to search.

200 కిలోమీటర్లు నడిచి కుప్పకూలాడు

By:  Tupaki Desk   |   29 March 2020 9:57 AM GMT
200 కిలోమీటర్లు నడిచి కుప్పకూలాడు
X
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వలస వెళ్లిన కార్మికులు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి లేక సతమతమవుతున్నారు. పనిలేక.. పట్టణాల్లో ఉండలేక స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. అష్టకష్టాలు పడుతూ తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. పిల్లాజెల్లా.. తట్టాబుట్ట సర్దుకుని కాలి నడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. రైళ్లు - బస్సులు నిలిచిపోవడంతో స్వగ్రామాలకు కాలి నడకన వెళ్తున్నారు. ఆ క్రమంలో చిన్నపిల్లలు - మహిళలు - వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలా వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌ లోని మొరెనా జిల్లా అంబా గ్రామానికి చెందిన కొందరు దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ లోని ఓ రెస్టారెంట్‌ లో పని చేస్తున్నారు. ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్‌ కూడా మూతపడింది. దీంతో వారు ఉపాధి కోల్పోయారు. ఇక ఢిల్లీలో ఉండలేక స్వగ్రామానికి బయల్దేరామనుకున్నారు. అయితే లాక్‌ డౌన్‌ తో బస్సులు - రైళ్లు కూడా నిలిపివేయడంతో చివరకు వారు కాలి నడకన వెళ్దామని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో అంబా ప్రాంతానికి చెందిన రణ్‌ వీర్‌ సింగ్‌ (38)తో పాటు మరో ఇద్దరు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి ఢిల్లీ నుంచి బయల్దేరారు. అలా ఆగ్రా మీదుగా మధ్యప్రదేశ్‌ లోని తన గ్రామానికి నడుచుకుంటూ వస్తున్నారు. 200 కిలో మీటర్లు అతి కష్టంగా నడవగా రణ్‌ వీర్‌ సింగ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నడుచుకుంటూనే ఢిల్లీ– ఆగ్రా రహదారిపై కుప్పకూలిపోయాడు. స్థానికులు పరిశీలించి వెంటనే ఆస్పత్రికి తరలించగా రణ్‌ వీర్‌ సింగ్‌ మృతి చెందాడు. నడుచుకుంటూ రావడంతో అతడికి ఛాతీనొప్పి వచ్చి కుప్పకూలి మృతిచెందాడని పోలీసులు ధ్రువీకరించారు.