Begin typing your search above and press return to search.

ఎంపీగా పోటీ చేస్తాడ‌ట‌.. బ్యాంక్ లోన్ ఇవ్వాల‌ట‌!

By:  Tupaki Desk   |   12 March 2019 4:48 AM GMT
ఎంపీగా పోటీ చేస్తాడ‌ట‌.. బ్యాంక్ లోన్ ఇవ్వాల‌ట‌!
X
ఎన్నిక‌ల వేళ చోటు చేసుకునే సిత్రాల‌కు కొద‌వ ఉండ‌దు. తాజాగా అలాంటిదే ఒక‌టి హైద‌రాబాద్ లో తెర మీద‌కు వ‌చ్చింది. అవినీతి మీద పోరాటం చేస్తున్న సామాజిక కార్య‌క‌ర్త ఒక‌రు తాజాగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. తాజాగా జ‌రుగుతున్న ఎంపీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెబుతున్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల ఖ‌ర్చుకోసం బ్యాంకును లోన్ అడుగుతున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

హైద‌రాబాద్‌లోని బాగ్ అంబ‌ర్ పేట నివాసి వెంక‌ట‌నారాయ‌ణ అనే సామాజిక కార్య‌క‌ర్త రానున్న ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న ఆయ‌న‌.. త‌న‌కున్న పేద‌రికం కార‌ణంగా త‌న‌కు బ్యాంకు లోన్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. న‌ల్ల‌కుంట‌లోని కెన‌రా బ్యాంకులో ఇందుకు సంబంధించిన లోన్ ద‌ర‌ఖాస్తును బ్యాంకు అధికారుల‌కు అంద‌జేశారు.

సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఎంపీగా పోటీ చేసేందుకు రూ.5ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌ని.. ఆర్థిక కార‌ణాల‌తో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు చెప్పారు. 15 ఏళ్లుగా అవినీతిపై ప్ర‌త్య‌క్ష ఉద్య‌మాల‌తో పోరాడుతున్న‌ట్లు వెంక‌ట‌నారాయ‌ణ చెబుతున్నారు.

త‌న సేవ‌ల్ని గుర్తించిన త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య త‌న‌ను స‌న్మానించి.. పుర‌స్కారం అంద‌జేసిన‌ట్లు చెప్పారు. 2014లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంబ‌ర్ పేట నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాన‌న్నారు.

గ‌తంలోనూ తాను రుణం కోసం బ్యాంకులో ద‌ర‌ఖాస్తు చేశాన‌ని.. అప్పుడు కూడా త‌న‌కు లోన్ ఇవ్వ‌లేద‌న్నారు. త‌న‌కు రుణం ఇస్తే.. వాయిదాల ప‌ద్ద‌తిలో తిరిగి చెల్లిస్తాన‌ని చెప్పారు. మ‌రి.. ఈ సామాన్యుడికి బ్యాంకు రుణం ఇస్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.