Begin typing your search above and press return to search.

‘డాన్’ కారును తగలబెట్టాక ఏమైంది?

By:  Tupaki Desk   |   1 Jan 2016 7:59 AM GMT
‘డాన్’ కారును తగలబెట్టాక ఏమైంది?
X
కొద్దిరోజుల క్రితం మీడియాలో వచ్చిన ఒక వార్త విపరీతంగా ఆకర్షించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లుగా ప్రకటన రావటం.. వాటిని సొంతం చేసుకోవటానికి మొదట కాస్తంత తటపటాయింపుకు గురి కావటం కనిపించింది. చివరకు దావూద్ ఆస్తుల్ని విజయవంతంగా వేలం వేశారు. ఇలా వేలం వేసిన వస్తువుల్లో అతగాడు వాడిన పాత కారును వేలానికి పెట్టారు. దానిని సొంతం చేసుకోవటానికి కొందరు మాత్రమే ఆసక్తి చూపారు. అలా చూపిన వారిలో అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ ఒకరు. డాన్ కారును కొనుగోలు చేసి.. దానికి కాస్తంత రిపేర్ చేసి రోడ్డు మీదకు అంబులెన్స్ రూపంలో ఎక్కించాలని.. పేదలకు సాయం చేయాలని ఆయన భావించాడు.

అంత పెద్ద డాన్ కారును కొనాలనుకుంటున్నావా? అన్న బెదిరింపుతో ఆయనకు మండిపోయింది. తననే బెదిరిస్తారా? అన్న అగ్రహంతో డాన్ కారును రూ.32 వేలకు కొనుగోలు చేసిన ఆయన.. దాన్ని తగలబెట్టేస్తానంటూ డేట్.. టైమ్ చెప్పి మరీ తగలబెట్టేశాడు. ఇందుకు అంత్యక్రియలు అంటూ కాస్తంత హడావుడి చేసి.. వాహనం లోపల కట్టెలు పెట్టేసి.. మరీ తగలబెట్టి.. దావూద్ పీడ విరగడైందంటూ ప్రకటించారు. ఘజియాబాద్ లో కారుని తగలబెట్టేశారు.

చక్రపాణి మహరాజ్ చేసిన చేష్టలు దావూద్ గ్యాంగ్ కు మంట పుట్టించాయి. తమ డాన్ కారుని అంత్యక్రియలంటూ అవమానించిన స్వామి చక్రపాణి మహరాజ్ ను ఊరికే వదిలిపెట్టకూడదంటూ డాన్ వర్గం కారాలు మిరియాలు నూరుతున్నారంట. ఇందులో భాగంగా కొత్తకొత్త ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నారట. దావూద్ కారును తగలబెట్టిన చోటే నిన్ను తగలబెట్టేస్తామంటూ బెదిరిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో జడ్ కేటగిరి భద్రత కల్పిస్తామని కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పినా తాను నో చెప్పినట్లుగా చెబుతూ.. తనలోని గుండె ధైర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. అంత ధైర్యమే ఉంటే.. వార్నింగ్ ల గురించి ఎందుకు చెబుతున్నట్లు..? ఏమైనా డాన్ కారు కాల్చినంత సింఫుల్ గా ఇష్యూ ముగిసినట్లు కనిపించట్లేదు కదూ.