Begin typing your search above and press return to search.

సహజీవనమైనా పెళ్లి కిందే లెక్క

By:  Tupaki Desk   |   7 March 2016 9:17 AM GMT
సహజీవనమైనా పెళ్లి కిందే లెక్క
X
దేశంలోని వివాహ చట్టాలపై న్యాయవ్యవస్థ సంచలనాత్మక రీతిలో స్పందిస్తోంది. తాజాగా వెలువడిన ఓ తీర్పు, ఇంకో జడ్జి వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. దీంతో భవిష్యత్తులో భారత వివాహ వ్యవస్థ చట్టపరమైన మార్పులను సంతరించుకుని మరింత సామాజిక భద్రత - సంప్రదాయబద్ధత దిశగా పయనిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇటీవలి కాలంలో పాశ్చాత్య పోకడలు పోతూ చాలామంది సహజీవన సంస్కృతిలోకి మారుతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఎక్కువ కాలం సహజీవనం చేస్తున్నారు. ఇది సమాజంలో అనేక సమస్యలకు కారణమవుతోంది కూడా. అంతేకాదు.... ఎంతో ఉతృష్ఖమైన భారతీయ వివాహ వ్యవస్థకు ఇది మచ్చలా ఉందని కూడా చాలామంది అంటుంటారు. తాజాగా ఇలాంటి సహజీవనం కూడా వివాహంగానే పరిగణించాలని తమిళనాడులోని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆయన తీర్పు కూడా ఇచ్చారు.

దీర్ఘకాలంపాటు సహజీవనం చేయడాన్ని... వారిద్దరి వివాహం జరిగిందనడానికి న్యాయబద్ధమైన సాక్ష్యంగా పరిగణించవచ్చని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. విడాకుల కోసం ఓ మహిళ చేసుకున్న దరఖాస్తుపై విచారణ జరపడానికి... వివాహం జరిగిందని నిరూపించే సాక్ష్యాలేవీ లేవని పేర్కొంటూ తిరునెల్వేలి కుటుంబ న్యాయస్థానం నిరాకరించడాన్ని జస్టిస్‌ ఎస్‌.మణికుమార్‌ - జస్టిస్‌ సి.టి.సెల్వంలతో కూడిన హైకోర్టు మదురై డివిజన్‌ ధర్మాసనం వ్యతిరేకించింది. విచారణార్హ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో కుటుంబ న్యాయస్థానం అత్యుత్సాహం ప్రదర్శించిందని వ్యాఖ్యానించింది. విడాకుల దరఖాస్తు విచారణ ప్రాథమిక దశలో ఉండగా ఇలాంటి వాటిని నిర్ణయించకూడదని సూచించింది. వివాహ ఆహ్వాన పత్రిక, ఫొటోలు వంటి రుజువులు లేనప్పుడు... దీర్ఘకాలం కొనసాగించిన సహజీవనాన్ని పెళ్లికి సాక్ష్యంగా తీసుకోవాలని తీర్పు చెప్పింది.

కాగా కేరళలో మరో న్యాయమూర్తి కూడా వివాహ వ్యవస్థకు సంబంధించిన చర్చకు తెరతీశారు. ముస్లిం వివాహ చట్టాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లి వివాహ చట్టం ప్రకారం పురుషుడు నలుగురు మహిళలను వివాహం చేసుకునే అవకాశం ఉందని... అలాంటప్పుడు మహిళలు కూడా నలుగురు పురుషులను పెళ్లి చేసుకునే అవకాశం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.కమల్ పాషా చేసిన ఈ వ్యాఖ్యలను ముస్లిం సంప్రదాయవాదులు తప్పుపడుతున్నప్పటికీ మహిళలకు జరిగే అన్యాయాలపై పోరాడే సంఘాలు మాత్రం హర్షిస్తున్నాయి. ముస్లిం వివాహ చట్టం ప్రకారం నలుగురు మహిళలను పెళ్లి చేసుకునే అవకాశం ఉండడం వల్ల దేశంలో ఎందరో ముస్లిం మహిళలు ఇబ్బందులు పడుతున్నారని... ఈ అవకాశం లేకుండా ఒక భర్తకు ఒక భార్య మాత్రమే అన్నట్లుగా ఉంటే ముస్లిం మహిళల జీవితాలు బాగుపడతాయన్న వాదన వినిపిస్తోంది.

కాగా మహిళా న్యాయవాదుల సెమినార్ లో ప్రసగించిన పాషా ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం చట్టాలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయని... పురుషాధిక్యత అందులో కనిపిస్తోందని ఆయన అన్నారు. ముస్లింల్లో బహుభార్యత్వాన్ని చాలా దేశాల్లో నిషేధించినా ఇండియాలో మాత్రం ఇంకా కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేని పరిస్థితుల్లో ఉందని.... మహిళలే దీనిపై ఉద్యమించాలని ఆయన అన్నారు.