Begin typing your search above and press return to search.

వావ్ కేటీఆర్‌... ప్లాన్ అదుర్స్‌!

By:  Tupaki Desk   |   4 Dec 2017 7:32 AM GMT
వావ్ కేటీఆర్‌... ప్లాన్ అదుర్స్‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర పుర‌పాల‌క‌ - ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ వాసుల‌కు అద్భుత‌మైన ఆఫ‌ర్ ఒక‌టి ఇచ్చారు. విశ్వ‌న‌గ‌రంగా భాగ్య‌న‌గ‌రాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని ఒక‌వైపు రాష్ట్రప్ర‌భుత్వం...మంత్రులు చెప్తున్నప్ప‌టికీ...ఎన్నో స‌మ‌స్య‌లు - ఇబ్బందులు - ఇక్క‌ట్ల‌తో భాగ్య‌నగ‌రం బాధ‌ల న‌గ‌రంగా మారిపోయింద‌ని ప్ర‌చారం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ కొత్త ముంద‌డుగు వేశారు. వ‌చ్చే వారం నుంచి 'మన నగరం / అప్నా షెహర్' పేరుతో నగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌తో అనుసంధానం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజా ట్వీట్‌ లో నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు - ప్రజలు - ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌ హాలు వేదికగా చర్చిస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'మన నగరం' పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్‌ లో పోస్ట్ చేశారు.

కాగా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఓ సారి మంత్రి కేటీఆర్ ఇదే ప్ర‌య‌త్నం చేశారు. బ‌ల్దియా ఎన్నిక‌ల్లో కారును విజ‌య‌తీరాల‌కు చేర్చేందుకు కేటీఆర్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేశారు. న‌గ‌రానికి వ‌చ్చే మంచినీటి పైపులైను ప్రారంభోత్స‌వం చేయ‌డం మొద‌లు డ‌బుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాప‌న‌ - ఉన్న‌త శ్రేణి వ‌ర్గాల‌తో స‌మావేశం కోసం విదేశాల్లో ఉన్న టౌన్ హాల్ స‌మావేశం వంటి కొత్త ట్రెండ్‌ ను ప‌రిచ‌యం చేయ‌డం - పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవ‌డం ఇలా బ‌హుపాత్ర‌ల్లో కేటీఆర్ బిజీబిజీగా మారిపోయారు. హైటెక్ సిటీలోని శిల్పారామంలో ఈ మేర‌కు టౌన్ హాల్ స‌మావేశం నిర్వ‌హించి అభిప్రాయాలు స్వీక‌రించారు. అనంత‌రం వాటిని గ్రేట‌ర్‌ లో అమ‌లు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా త‌మ ఏడాదిన్న‌ర పాల‌క‌వ‌ర్గం ప‌నితీరు - హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను మంత్రి కేటీఆర్ మ‌రోమారు ఇదే టౌన్ హాల్ రూపంలో విన‌నున్నారు. మ‌రి ఈ వినూత్న ప‌రిష్కార వేదిక‌గా ఎంత‌మేర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయో వేచిచూడాల్సిందే.