బాబుకు షాక్ తప్పదా?
By: Tupaki Desk | 22 April 2015 4:18 AM GMTటామ్ ఆండ్ జెర్రీ వలే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుకు, తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య నడుస్తున్న వార్ పరిస్థితి. తెలంగాణలో టీడీపీని బొందపెడదాం అని కేసీఆర్ బహిరంగంగానే స్టేట్ మెంట్లు ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఆ మేరకు పలు రకాలుగా పార్టీ ఫిరాయింపుల జోరును కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ లో తెలంగాణ అభివృద్ధి కోరి చేరే వారి సంఖ్య కన్నా..రాజకీయ ప్రయోజనాల కోసం చేరే వారే అధికం అన్నది వాస్తవం. మరోవైపు చంద్రబాబు తెలంగాణలో తన పార్టీని నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న కొద్దిమంది నాయకులనయినా కాపాడుకునేలా ఆయన కసరత్తు చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రెండు రోజులుగా బాగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేరిక ఆధారంగానే బాబుకు గట్టి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 23న చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పర్యటించే రోజునే కిషన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా వేగంగా కసరత్తు జరుపుతున్నారు.
ఇదే సమయంలో మంచిరెడ్డి సైతం చేరిక విషయమై తన చర్యలతో పరోక్షంగా పార్టీ వీడటం ఖాయమన్నట్లు చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన నివాసంలో చంద్రబాబు మహబూబ్ నగర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి మంచిరెడ్డి హాజరు కాలేదు. అదే సమావేశం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు మంచిరెడ్డికి ఫోన్ చేయగా.. తాను వీలు చూసుకొని వస్తానని చెప్పారు.
మొత్తంగా చంద్రబాబు ఎత్తులకు తగ్గట్లు గులాబీ పార్టీ వ్యవహరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.