Begin typing your search above and press return to search.

బాబుపై మంద‌కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   11 July 2017 3:31 AM GMT
బాబుపై మంద‌కృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
కాలం మ‌హా చిత్ర‌మైంది. ఎప్పుడెట్లా మారిపోతుందో ఊహించ‌టం చాలా క‌ష్టం. ఒక‌ప్పుడు ఎవ‌రికైతే తాను అండ‌గా ఉన్నానో.. ఇప్పుడు అదే వ్య‌క్తి కార‌ణంగా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అప్ప‌ట్లో సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేయాల‌ని నిర్ణ‌యించిన వేళ‌..తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మం తీవ్ర‌స్థాయిలో సాగుతోంది. అలాంటి వేళ‌లో తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌టం అంత సులువైన విష‌యం కాదు.

అయితే.. బాబు పాద‌యాత్ర‌కు త‌మ దండు ముందు ఉంటుంద‌న్న హామీని ఇచ్చిన మంద‌కృష్ణ మాదిగ‌.. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చంద్ర‌బాబు పాద‌యాత్ర చేసే వేళ‌.. ద‌న్నుగా నిలిచారు. తెలంగాణ‌లో బాబు పాద‌యాత్ర విజ‌య‌వంతం అయ్యిందంటే అందుకు ఎమ్మార్పీఎస్ అధినేత మంద‌కృష్ణ మాదిగ ఇచ్చిన స‌హాయ స‌హ‌కారాలేన‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. పాద‌యాత్ర సింహ‌భాగంలోనూ.. చివ‌ర్లోనూ ఎమ్మార్పీఎస్ నేత‌లు.. మంద‌కృష్ణ మాదిగను అభిమానించే వారు.. ఆరాధించే వారు భారీ ఎత్తున ఉండేవారు. ఇదేదో ఒక‌ర్రెండు ప్రాంతాల్లో కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఎక్క‌డైతే బాబు పాద‌యాత్ర చేశారో.. ప్ర‌తి చోటా ఉండేలా ప్లాన్ చేయ‌టంలో మంద‌కృష్ణ పాత్ర‌ను త‌గ్గించి చెప్ప‌లేం.

ఒక‌ప్పుడు ఎవ‌రికైతే తాను అండ‌గా నిల‌బ‌డ్డాడో.. ఇప్పుడు అదే వ్య‌క్తి కార‌ణంగా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు మంద‌కృష్ణ మాదిగ‌. ఏపీ స‌ర్కారుతో పాటు.. ఏపీ ముఖ్య‌మంత్రి కార‌ణంగా తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేక‌పోతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. తాను చెప్పే మాట‌లు ఆరోప‌ణ‌లు ఎంత‌మాత్రం కాద‌ని.. అవి వాస్త‌వాలుగా ఆయ‌న చెప్పారు. బాబు కుటుంబానికి తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో ర‌క్ష‌ణ‌లో ఉండాలి కానీ.. తెలంగాణ వారికి ఏపీలో ర‌క్ష‌ణ అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించారు.

విజ‌య‌వాడ వెళ్లేందుకు పాస్‌ పోర్ట్‌.. వీసా తీసుకోవాలా? అని సూటిగా అడుగుతున్న మంద‌కృష్ణ.. తాను ఈ నెల 8న విజ‌య‌వాడ వెళ్లాల‌ని అనుకున్నా వెళ్ల‌లేక‌పోయిన‌ట్లుగా వెల్ల‌డించారు. విజ‌య‌వాడ వెళ్లాల‌నుకున్న త‌న‌ను ఒక కారు వెంబ‌డించిద‌ని.. ఆ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. ఒక‌వేళ కేసీఆర్ అపాయింట్ మెంట్ కానీ ల‌భించ‌ని పక్షంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని క‌లిసి విష‌యం చెబుతాన‌ని చెప్పారు. ఏమైనా ఒక‌ప్పుడు బాబుకు ర‌క్ష‌గా నిలిచిన మంద‌కృష్ణ‌.. ఈ రోజు అందుకు భిన్నంగా త‌న ప్రాణాల‌కే బాబు వ‌ల్ల ముప్పు ఉంద‌ని చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.