Begin typing your search above and press return to search.

ఆయ‌న్ను చంపాల‌నే జైలుకు పంపార‌ట‌!

By:  Tupaki Desk   |   10 March 2018 4:41 AM GMT
ఆయ‌న్ను చంపాల‌నే జైలుకు పంపార‌ట‌!
X
త‌న ఉద్య‌మాల‌తో ప్ర‌భుత్వాల‌కే వ‌ణుకు పుట్టించిన ఘ‌నచ‌రిత్ర ఎమ్మార్పీస్ అధినేత మంద‌కృష్ణ మాదిగ సొంతం. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆయ‌న ఆందోళ‌న పిలుపునిస్తే.. వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోయేవి. ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యేది. ఇక‌.. పోలీసులు అయితే.. ఏ నిమిషాన ఏం జ‌రుగుతుందో అర్థం కాక తీవ్ర ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. దీనికి త‌గ్గ‌ట్లే.. మెరుపు నిర‌స‌న‌లు చోటు చేసుకొని సంచ‌ల‌నాలు న‌మోద‌య్యేవి.

అలాంటి మంద‌కృష్ణ మాదిగ ఇప్పుడు తెలంగాణ అధికార‌ప‌క్షంపై చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు విస్మ‌యాన్ని రేకెత్తించ‌ట‌మే కాదు.. షాక్ కు గురి చేస్తాయి. త‌న‌ను భౌతికంగా హ‌త‌మార్చేందుకే తెలంగాణ ప్ర‌భుత్వంలోని కీల‌క వ్య‌క్తులు కుట్ర‌లు చేసి జైలుకు పంపించిన‌ట్లుగా మంద‌కృష్ణ మాదిగ ఆరోపించారు. తాను దీక్ష‌లో కూర్చొని ప‌ది నిమిషాలు కాక ముందే త‌న‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపార‌న్నారు. కుట్ర‌లో భాగంగానే త‌న‌ను ఇలా చేశార‌ని.. అందుకు త‌గిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్న‌ట్లు చెప్పారు.

త‌న‌ను హ‌త‌మార్చేందుకు జ‌రుగుతున్న కుట్ర‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న హ‌త్య కుట్ర‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త‌ను సీఎం స‌న్నిహిత మంత్రి.. ఒక ఎమ్మెల్యే తీసుకున్న‌ట్లుగా చెప్పారు. అయితే.. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌టంతో త‌మ ప‌థ‌కాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

కుట్ర‌ను తాత్కాలికంగా ఆపారే కానీ.. వెంటాడ‌టం మాత్రం ఇంకా ఆప‌లేద‌న్నారు. ఇటీవ‌ల తాను సూర్యాపేట నుంచి కారులో వ‌స్తుంటే.. త‌న కారును వేరే కారు వెంబ‌డించింద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం మ‌ర‌ణించటం త‌న అదృష్ట‌మ‌న్న మంద‌కృష్ణ‌.. త‌మ‌లాంటోళ్లు ప్ర‌శ్నించ‌ట‌మే నేర‌మ‌ని హ‌త‌మారిస్తే తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం బ‌తుకుతుందా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

తాను వ్య‌క్తిగ‌తంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌లు ఎవ‌రిని దూషించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. కాకుంటే.. ప్ర‌భుత్వ విధానాలు.. పొర‌పాట్ల‌ను.. లోపాల్ని మాత్ర‌మే ఎత్తి చూపాన‌ని.. దీనికే కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లుగా వాపోయారు. త‌న‌కు ఎప్ప‌టికైనా ప్ర‌మాదం జ‌రిగినా.. తన ప్రాణాల‌కు హాని క‌లిగినా కేసీఆర్ ప్ర‌భుత్వం.. అందులోని కీల‌క వ్య‌క్తులే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. తాను చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు త‌గిన‌న్ని ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. వాటిని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌న్నారు. త‌న‌ను వెంబ‌డించిన కారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందింద‌ని.. దానికి సంబంధించిన ఆధారాల్ని త్వ‌ర‌లోనే తాను బ‌య‌ట‌పెడ‌తాన‌న్నారు. ఉద్య‌మాల‌తో పాల‌కుల్ని ఉరుకులు ప‌రుగులు పెట్టించిన నేత‌.. ఇప్ప‌డిలా ఆరోప‌ణ‌లు చేసుడేంది?