Begin typing your search above and press return to search.

ఇంతకీ మందకృష్ణ ఎక్కడ..?

By:  Tupaki Desk   |   10 March 2016 5:03 AM GMT
ఇంతకీ మందకృష్ణ ఎక్కడ..?
X
ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నా కొందరి తీరు చాలా భిన్నంగా ఉంటుంది. వారు మౌనంగా ఉన్నంతవరకూ ఓకే. ఒకసారి గళం విప్పి.. ఆందోళనలకు పిలుపునిస్తే.. నిరసనలు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. అలాంటి ఉద్యమనేతల్లో ఒకరు మందకృష్ణ మాదిగ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ.. టీఆర్ ఎస్ హవా తెలంగాణ మొత్తం నడుస్తున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో తిరగలేని పరిస్థితుల్లో.. ఆయన పాదయాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయించిన ఘనత దక్కించుకున్న వాళ్లలో మందకృష్ణ ముందుంటారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని.. గడిచిన 22 నెలల్లో బాబు సర్కారు నెరవేర్చని నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ విశ్వరూపయాత్రకు మందకృష్ణ పిలుపునిచ్చారు. విశ్వరూప యాత్రను చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలో చేస్తానని ప్రకటించటం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం గుండెల్లో ఆయన దడ పుట్టించారనే చెప్పాలి. సీఎం సొంతూరులో జరిగే ఆందోళనలో ఏ చిన్న తేడా జరిగినా దాని పరిణామాలు తీవ్రంగా ఉండే పరిస్థితుల్లో అప్రమత్తమైన యంత్రాంగం.. మందకృష్ణ కోసం కాపు కాసింది.

మార్చి 11 (శుక్రవారం)న నారావారిపల్లెలో నిర్వహించాల్సిన విశ్వరూప యాత్రలో పాల్గొనటానికి మందకృష్ణ వెళుతున్న నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనకు హైకోర్టు అనుమతి ఇవ్వకపోవటం.. దీనిపై పోలీసులు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని పేర్కొన్న నేపథ్యంలో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్న మందకృష్ణను ఎక్కడ ఉంచారన్నది గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో.. ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై ఉత్కంట నెలకొంది. మరోవైపు.. విశ్వరూప యాత్రను సమర్థంగా అడ్డుకునేందుకు వీలుగా తిరుపతి.. చంద్రగిరితో సహా పలు ప్రాంతాల్లో పోలీసుల్ని భారీగా మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తమ్మీదా విశ్వరూప యాత్ర టెన్షన్ చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.