Begin typing your search above and press return to search.

10 ల‌క్ష‌ల‌మందితో అమ‌రావ‌తిని ముట్ట‌డిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   31 May 2017 11:28 AM GMT
10 ల‌క్ష‌ల‌మందితో అమ‌రావ‌తిని ముట్ట‌డిస్తార‌ట‌
X
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబునాయుడుపై మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసగించిన రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను తూర్పారబట్టారు. గత ఎన్నికల్లో విశాఖ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా నిలుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అదే వేదికగా నిర్వహించిన మహానాడులో వర్గీకరణపై తీర్మానం చేయకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్టమ్రైన తెలంగాణలో జరిగిన మహానాడులో మాత్రం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తీర్మానం చేయడం చంద్రబాబు ద్వంద వైఖరికి నిదర్శనమని మంద‌కృష్ణ విరుచుకుపడ్డారు. ఎంఆర్‌ పీఎస్ 23వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 7వ తేదీన అమరావతిలో నిర్వహించనున్న కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లాల పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో ప‌ర్య‌టించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంద‌కృష్ణ మాట్లాడారు.

ఎస్సీలను మోసగించిన మాదిరిగానే కాపులను కూడా బీసీల్లో చేరుస్తానంటూ శుష్క వాగ్దానాలు ఇస్తూ ఆ వర్గాన్ని మోసగిస్తున్నారని మంద‌కృష్ణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేనిదే కాపులను బీసీల్లో చేర్చడం, వారికి 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించడం జరగని పని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తొక్కి పెడుతున్నారని మంద‌కృష్ణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచిన మాదిగలను నేడు రోడ్ల మీదకు వచ్చే దుస్థితి కల్పించారన్నారు. చంద్రబాబుపై రాళ్లు విసిరిన వారికి ఉన్నతమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించడం బాధాకరమన్నారు. త‌మకు అన్యాయం చేసిన చంద్ర‌బాబుకు త‌మ స‌త్తా చూపిస్తామ‌ని మంద‌కృష్ణ అన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన గడ్డ అమరావతి సాక్షిగా కురుక్షేత్ర మహాసభ ద్వారా మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని మంద‌కృష్ణ‌ హెచ్చరించారు. 10లక్షల మంది మాదిగలతో సునామీలా అమరావతిని గడ్డను తాకి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తామని సవాల్ విసిరారు. కురుక్షేత్ర మ‌హాస‌భ‌లోగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు ఓకే చెప్తారా లేక త‌మ ఉద్య‌మాన్ని అణ‌చివేస్తారో బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌ని మంద‌కృష్ణ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/