Begin typing your search above and press return to search.

బాబు ఒక్క‌టి చేస్తే..మేం వంద చేస్తాంః మంద‌కృష్ణ‌

By:  Tupaki Desk   |   16 July 2017 6:49 AM GMT
బాబు ఒక్క‌టి చేస్తే..మేం వంద చేస్తాంః మంద‌కృష్ణ‌
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని నీరు గారుస్తున్నార‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఇచ్చిన మాట‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తానే ప‌క్క‌న‌ప‌డేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుద‌ని వ్యాఖ్యానించారు. వ‌ర్గీక‌ర‌ణ‌కు ఉద్య‌మానికి మ‌ద్ద‌తివ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా ప్రజాస్వామ్య‌యుతంగా తాము ఏర్పాటుచేసుకున్న స‌భ‌పై ఉక్కుపాదం మోపార‌ని ఆరోపించారు. హైకోర్టు సూచనను కూడా పట్టించు కోకుండా కురుక్షేత్ర మహాసభపై సీఎం చంద్రబాబు ఆంక్షలు విధించారని మండిప‌డ్డారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు, మాదిగ జాతికి మేలు చేసే చ‌ర్య‌లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా చూడటానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక చర్య చేపడితే తాము వంద చర్యలు చేపడుతామని మంద‌కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో బాబు తీరును మాదిగ జాతి గ‌మ‌నిస్తున్న‌ద‌ని మంద‌కృష్ణ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని సీఎం కేసీఆర్‌ కు మంద‌కృష్ణ‌ మనవి చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తే కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఎస్సీ వర్గీకరణపై 17వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ జిల్లా అధ్యక్షులను కలుస్తామని ఆయ‌న తెలిపారు. 18వ తేదీన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 19న జిల్లా - మండల కేంద్రాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని వివ‌రించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు అన్ని జిల్లా - మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు - ధర్నాలు చేస్తామన్నారు.

ఆగ‌స్టు 8వ తేదీన తహసీల్దార్ల కార్యాలయాలను ముట్టడిస్తామని, కళాశాల బంద్‌ నిర్వహిస్తామని మంద‌కృష్ణ‌ చెప్పారు. పదో తేదీన కలెక్టరేట్లను దిగ్బంధిస్తామన్నారు. ఆగ‌స్టు 11వ తేదీన కురుక్షేత్ర సభను అమరావతిలో నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు. త‌మ జాతి ఆకాంక్ష‌ను స‌ఫ‌లం చేసేందుకు పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఆయ‌న అన్నిపార్టీల‌ను డిమాండ్‌ చేశారు.