Begin typing your search above and press return to search.

నాది ప్యాకేజీల ఉద్య‌మం కాదు

By:  Tupaki Desk   |   30 Dec 2017 9:53 AM GMT
నాది ప్యాకేజీల ఉద్య‌మం కాదు
X
త‌న సుదీర్ఘ‌కాల డిమాండ్ అయిన ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం కృషి చేస్తున్న‌ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు. త‌న ఉద్య‌మ పంథా నుంచి మొదలుకొని..కేంద్ర రాష్ట్ర రాజ‌కీయాల వ‌ర‌కు ఆయ‌న వివ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మొదలుకొని తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు అంద‌రిపై త‌న‌దైన శైలిలో రియాక్ట‌య్యారు. మాదిగ రిజర్వేషన్ల సాధనలో చివరి ఘట్టంలో ఉన్నామని మంద‌కృష్ణ తెలిపారు.

ఎమ్మార్పీఎస్ ఉద్యమం విఫలం కాలేదని మంద‌కృష్ణ మాదిగ తెలిపారు.వ‌ర్గీక‌ర‌ణ‌ డిమాండ్ పరంగా ఓసారి సాధించామ‌ని కొన్ని ఫలాలు అనుభవించామని వెల్ల‌డించారు. సాంకేతికపరంగా సుప్రీంకోర్టులో పలుకబడి ఉన్న మాల సామాజిక వర్గంతో అది రద్దు అయ్యిందని మంద కృష్ణ వెల్ల‌డించారు.తాను తెలంగాణ కేసీఆర్‌ కు శత్రువును కాదు, వ్యతిరేకిని కాదని మంద కృష్ణ అన్నారు. త‌న‌ విమర్శలను కేసీఆర్ దొరమనస్తత్వంతో చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సైతం స్పందించారు. వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానన్న చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నాడని మండిపడ్డారు. త‌నది ప్యాకేజీల ఉద్యమం కాదని మందకృష్ణ వివ‌రించారు.త‌నకు విశ్వసనీయత లేకపోతే ఉద్యమం ఇన్నేళ్లు ఉండేదా? అని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించారు.

తమ మొదటి శత్రువు భారతీయ జనతా పార్టీయే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు అయిన మంద‌కృష్ణ వెల్ల‌డించారు.వర్గీకరణ చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ - బీజేపీ చీఫ్ అమిత్‌ షా తెలంగాణలో తిరగగలరా? అంటూ ప్రశ్నించారు. పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. అందువల్ల తాను జనవరి ఒకటి నుంచి ఐదురోజులపాటు చేపట్టే ఉపవాస దీక్షకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాపార్కు. రాజ్‌ ఘాట్‌ వద్ద దీక్షకు అనుమతించాలని లేకపోతే జీహెచ్‌ ఎంసీ పరిధిలో ఎక్కడైనా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.