Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ లాంటి పిచ్చోడిని చూడ‌లేదు: మందకృష్ణ

By:  Tupaki Desk   |   24 Jan 2018 11:02 AM GMT
ప‌వ‌న్ లాంటి పిచ్చోడిని చూడ‌లేదు: మందకృష్ణ
X
మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు మందకృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది నిర్వ‌హించిన ఓ స‌భ‌లో విద్వంసానికి పాల్ప‌డ్డార‌నే అంశంపై జైల్లో ఉన్న మంద‌కృష్ణ‌కు బెయిల్ మంజూరైంది. విడుద‌లైన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండ రామ్ లాంటి వాళ్ళు పర్యటన చేసే స్వేచ్ఛలేదు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎంఆర్‌ పీఎస్‌ దీక్ష చేసే స్వేచ్ఛలేదని అస‌హనం వ్య‌క్తం చేశారు. కానీ...పవన్ కళ్యాణ్ తిరిగేందుకు అనుమతిచ్చారని మండిప‌డ్డారు.

``మమ్మల్ని ఆపేందుకు పోలీసులను పెట్టారు...పవన్ కళ్యాణ్ తిరిగేందుకు పోలీసులను పెట్టారు. తెలంగాణాలో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయి...ఆ పునాదులను కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ను తిప్పుతున్నారు` అని మంద‌కృష్ణ మండిప‌డ్డారు. `పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు వస్తున్నారు...కానీ ఓటేసేందుకు ఎవ్వరురారు.` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `ఇక్కడ కేసీఆర్ పాలన - ఏపీలో సీఎం చంద్రబాబు పాలన బాగుందని పవన్‌ క‌ళ్యాణ్  అంటున్నారు. అంతా బాగుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నారు.? చాలామంది పిచ్చోళ్ళను చూశాను కాని పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోన్ని చూడలేదు` అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ - మంత్రులు హరీష్ రావు - కేటీఆర్‌ పై గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయని మంద‌కృష్ణ గుర్తుచేశారు. ఆ కేసులు తిరగదోడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ను కలుస్తానని తెలిపారు. గవర్నర్ చట్టం అందరికి సమానంగా పనిచేసేవిధంగా చూడాలని కోరారు. చట్టం ఒకరికి చుట్టంగా...మరోకరిని అణచివేసేవిధంగా ఉండకూడదన్నారు. త‌న‌పై నాన్ బెయిలబుల్ కేసు లేకున్నా జైల్లో ఎందుకు పెట్టారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విషయంలో గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. `కేసీఆర్ గతంలో పది రోజులు దీక్ష చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. ఎందుకు కేసులు పెట్టలేదు. నేను 48 గంటలు దీక్ష అని...48 సెకన్లు కూడా చేయకుండానే ఎందుకు అరెస్ట్ చేశారు...?మిలియన్ మార్చ్  ఘటన లో అత్యంత విధ్వంసం జరిగింది. అందుకు కారణమైన వారిని ఆ ఘటనలో అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు...? ప్రజా ఉద్యమం అణచివేయలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళకు పోలీస్ వ్యవస్థ కక్ష తీర్చుకునే యంత్రాంగంగా మారోద్దు. గవర్నర్ ను కలిసేందుకు ఈరోజు అపాయింట్ మెంట్  కోరుతాం. దొరలకు ఒకన్యాయం....దళితులకు ఒక న్యాయమా..అని అడుగుతాం` అని మంద‌కృష్ణ తెలిపారు.

ఈ  పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ పై బిల్లు తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌ని మంద‌కృష్ణ తెలిపారు. సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారని ఈ అంశం పై ఒత్తిడితెస్తామ‌ని వివ‌రించారు. 27 లోపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని రాజకీయపార్టీలను భాగస్వామ్యం చేసి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌ని ప్ర‌క‌టించారు.