Begin typing your search above and press return to search.

ఆ ఫైర్ బ్రాండ్ ముగ్గురికే పాదాభివందనం చేశారట

By:  Tupaki Desk   |   28 Nov 2016 7:28 AM GMT
ఆ ఫైర్ బ్రాండ్ ముగ్గురికే పాదాభివందనం చేశారట
X
తెలుగు ప్రజలకు మందకృష్ణ మాదిగ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యమాన్ని ఫైర్ బ్రాండ్ తరహాలో లీడ్ చేయటమే కాదు.. ఎంతటి వారినైనా సరే.. ముప్పుతిప్పలు పెట్టగల సత్తా.. సామర్థ్యం ఆయన సొంతంగా చెబుతుంటారు. ఆయన కానీ ఎవరిమీదనైనా టార్గెట్ చేస్తే.. ఇక అంతే అన్న మాట వినిపిస్తూ ఉంటుంది.ఆయన ధాటికి టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం గతంలో ఇబ్బంది పడినట్లుగా చెప్పాలి. తన నోటి మాటలతో మంట పుట్టించే కేసీఆర్ కు.. మందకృష్ణ ఒకసారి షాక్ తినేలా రియాక్ట్ కావటమే కాదు.. గడువు ఇచ్చి మరీ ఆయన చేత సారీ చెప్పించిన ఘన చరిత్ర మందకృష్ణ సొంతం.

అలాంటి ఆయన తాజాగా ధర్మయుద్ధం పేరిట..ఎస్సీ వర్గీకరణ కోసం భారీ సభను నిర్వహించారు. ఈ సభకు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన మాదిగలు పెద్ద ఎత్తున రావటం.. లక్షలాదిగా పోటెత్తిన జనసందోహాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ బహిరంగ సభలోమాట్లాడిన సందర్భంగా మందకృష్ణ చెప్పిన ఒక ముచ్చట అందరి దృష్టిని ఆకర్షించింది. తాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి పాదాభివందనం చేయటంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయని చెప్పిన ఆయన.. తాను పాదాభివందనాన్ని ఎందుకు చేశానో చెప్పుకొచ్చారు.

తాను ఇప్పటివరకూ ముగ్గురికి మాత్రమే పాదాభివందనం చేసినట్లుగా చెప్పిన మందకృష్ణ.. ఏయే సందర్భాల్లో ఎవరెవరికి తాను పాదాభివందనాలు చేసింది వివరంగా చెప్పుకొచ్చారు. 1984-85 ప్రాంతాల్లో వరంగల్ ఎస్పీగా పని చేసిన అరవింద్ రావు ఉన్నప్పుడు తనను బూటకపు ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులు ప్రయత్నించారని.. అయితే.. తక్కలపల్లి పురుషోత్తం రావు తనను కాపాడటమే కాదు.. ట్రాక్టర్ లోన్ ఇప్పించి తమ కుటుంబ ఆకలిని తీర్చారని.. అందుకే ఆయనకు పాదాభివందనం చేసినట్లు చెప్పారు.

ఇక.. మీరా కుమార్ ఉషా మెహ్రా కమిషన్ ను వేయించారిని.. అందుకే ఆ అక్క కాళ్లకు మొక్కినట్లు చెప్పిన మందకృష్ణ.. తనకు మొదటి నుంచి వెన్నంటి ఉన్న వెంకయ్యకు పాదాభివందంగా చేసినట్లుగా వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకువెంకయ్య ఎంతో పని చేశారని.. అన్ని పార్టీలకు ఇంగ్లిషులో లేఖలు రాయించి.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో ప్రయత్నం చేశారని.. సొంత తమ్ముడి లెక్కన చూసుకున్నారని.. అందుకే ఆయన కాళ్లకు మొక్కానని.. అదేమీ బానిసత్వం కాదని చెప్పుకొచ్చారు. నిప్పు కణిక లాంటి మందకృష్ణ చెప్పిన ఈ ముచ్చట ఓకే అయినా.. రేపొద్దున ఆయనకు కానీ ఆగ్రహం వస్తేనే అసలు ఇబ్బంది అంతా అనుకోవటం గమనార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/