Begin typing your search above and press return to search.

ఎస్సీ వర్గీకరణ కోసం మంద క్రిష్ణ పట్టు

By:  Tupaki Desk   |   2 Feb 2022 4:30 PM GMT
ఎస్సీ వర్గీకరణ  కోసం మంద క్రిష్ణ పట్టు
X
ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటే రెండు దశాబ్దాల నాటి ఉద్యమాలు గుర్తుకు వస్తాయి. నాడు ఈ అంశం మీద అతి పెద్ద పోరాటాలే జరిగాయి. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా ఎస్సీ వర్గీకరణ అంటూ మంద క్రిష్ణ ఉద్యమించారు. అదే టైమ్ లో కాంగ్రెస్ కి బ్యాక్ బోన్ గా ఓటు బ్యాంక్ గా ఉన్న ఎస్సీలలో చీలిక తీసుకురావడానికి టీడీపీ పెద్దలు మంద క్రిష్ణ ద్వారా ఇలా డిమాండ్ చేయించారు అని ప్రచారం అయితే సాగింది. ఈ ఆరోపణలు ఎలా ఉన్నా చంద్రబాబుకు మాత్రం రాజకీయ నష్టమే చాలా రకాలుగా సాగింది.

మొత్తానికి ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా 2004లో తప్పుకున్నారు. తరువాత వైఎస్సార్ హయాంలో కూడా ఈ డిమాండ్ వినిపించినా కూడా బాబు ఉన్నప్పటిలా కధ సాగలేదు. ఇక ఆ సమయంలో ఉమ్మడి ఏపీ విభజన మీదనే అంతా ఫోకస్ పెట్టి ఉంచారు. ఇవన్నీ ఇలా ఉండగానే రెండు ముక్కలుగా ఏపీ విడిపోయింది. దీంతో మాదిగలు పెద్ద ఎత్తున తెలంగాణాలో ఉంటే ఏపీలో మాలలు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి.

అదే విధంగా మంద క్రిష్ణ పోరాటాలు కూడా ఆ తరువాత జోరందుకోలేదు. అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయనగా మంద క్రిష్ణ మాదిగా గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. ఆయన తాజాగా విశాఖ టూర్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక డిమాండ్ వినిపించారు. ఎస్సీ వర్గీకరణ చేసి తీరాల్సిందే అని కూడా చెప్పేశారు.

ఈ బాధ్యత ఇద్దరు సీఎంలు కేసీయార్, జగన్ తీసుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అయితే మాదిగ, రెల్లి ఉప కులాలకు మేలు జరుగుతుంది అని కూడా ఆయన చెపుకొచ్చారు. అదే విధంగా ఎస్సీల వర్గీకరణ లక్ష్యంగా ఎంతోకాలంగా తాము పోరాడుతున్నామని చెప్పారు. ఈసారి ఊరుకునేది లేదు అని కూడా అంటున్నారు.

ఇతర పార్టీల మద్దతు కూడగట్టి మరీ ఎస్సీల వర్గీకరణ జరిపేలా చూడాల్సిన బాధ్యత అయితే ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులనే అని మందక్రిష్ణ అంటున్నారు. ఈ విషయంలో తాము మళ్లీ ఉద్యమిస్తామని కూడా స్పష్టం చేశారు. ఏపీలో చూస్తే ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వారంతా వైసీపీకి ఓటు బ్యాంక్ గా ఉన్నారు. ఇపుడు ఎస్సీ వర్గీకరణ అంటే వారి విషయంలో ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ భావించే చాన్స్ ఉంది.

అలా కాకపోతే ఉప కులాల్లో అసంతృప్తి ఎక్కువగా బయటకు వస్తుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అనేక అంశాలలో ఇది ఒక అస్త్రంగా విపక్షాలకు ప్రత్యేకించి టీడీపీకి మారుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మాదిగలు టీడీపీకి గట్టి మద్దతుదారులుగా మార్చుకోగలిగింది. ఇపుడు విభజన ఏపీలో ఎస్సీలలో మరికొన్ని ఉప శాఖలను తన వెంట తెచ్చుకునేలా టీడీపీ ఈ విషయంలో ఆచీ తూచీ స్పందిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద జగన్ ఏం చేస్తారో.