Begin typing your search above and press return to search.

వేదికపై మోడీ అభాసుపాలయ్యారా?

By:  Tupaki Desk   |   4 Dec 2015 5:43 AM GMT
వేదికపై మోడీ అభాసుపాలయ్యారా?
X
ప్రధానమంత్రి మోడీకి అలాంటి ఇలాంటి పంచ్ కాదు.. భారీ పంచ్ పడింది. అది కూడా అంతర్జాతీయ వేదిక మీద. అదీ సొంత పార్టీకి చెందిన నాయకురాలి చేతిలో కావటం ఇప్పుడు తాజా సంచలనంగా మారింది. ప్యారిస్ లో జరుగుతున్న కాప్ సమ్మిట్ లో పాల్గొని వర్థమాన దేశాల తరఫున తన వాదనను బలంగా వినిపించి.. కాలుష్యం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు.. సంపన్న దేశాలదే పాపం అంటూ బలమైన వాదనను వినిపించిన మోడీ మాటకు పూర్తి విరుద్ధంగా తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ అదే కాప్ వేదిక మీద.. వర్థమాన దేశాలను విమర్శించటం సంచలనంగా మారింది.

ప్రధానమంత్రి మోడీ వాదనకు పూర్తి భిన్నంగా.. సంపన్న దేశాలకు అండగా.. వర్థమాన దేశాలు డిఫెన్స్ లో పడే తీరుగా ఆమె వ్యాఖ్యలు చేయటం విశేషం. వాతావరణ కాలుష్యానికి పశ్చిమ దేశాల్ని బాధ్యులుగా చేయటం సరికాదని.. వాతావరణ కాలుష్యంలో భారత్ లాంటి దేశాల పాత్రను విస్మరించలేమంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ప్రధాని మోడీ మాటలకు భిన్నమైన ధోరణిలో చేస్తున్న వ్యాఖ్యలపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశం నుంచి.. అందునా అధికారపక్షానికి చెందిన వారు.. విరుద్ధ భావాల్ని వ్యక్తం చేయటం.. బాధ్యతల విషయంలో వర్ధమాన దేశాలదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించటం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

అన్నింటికి మించి తన వాగ్ధాటితో సంపన్న దేశాల్ని ప్రశ్నించిన మోడీని అభాసుపాలు చేసేలా కేంద్రమంత్రి మేనకాగాంధీ మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏ వేదిక మీద అయితే.. మోడీ మాట్లాడారో.. అదే వేదిక మీద నుంచి సరిగ్గా దానికి విరుద్ధమైన వాదనను వినిపించటం ద్వారా.. అంతర్జాతీయ వేదిక మీద భారత్ అభాసుపాలు అవుతుందన్న మాట వినిపిస్తోంది. భారత దేశంలో మిథేన్ ఉత్పత్తి అధికంగా జరుగుతుందని.. ఎప్పుడో పారిశ్రామిక విప్లవం సమయంలో సంపన్న దేశాలు కాలుష్యానికి కారణం అయితే.. ఇప్పుడు వాటిని మాత్రమే బాధ్యుల్ని చేయటం సరికాదన్న ఆమె వాదన భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు. మరి.. మేనకాగాంధీ మాటలపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.