Begin typing your search above and press return to search.

మంగ‌ళ‌గిరిలో లోకేశ్ కు చుక్క‌లు క‌నిపిస్తున్న‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 March 2019 4:10 AM GMT
మంగ‌ళ‌గిరిలో లోకేశ్ కు చుక్క‌లు క‌నిపిస్తున్న‌ట్టేనా?
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్... ఎట్ట‌కేల‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. ఓ పార్టీ అధినేత - ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న నేత కుమారుడు చ‌ట్ట‌స‌భ‌ల్లోకి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తారా? అంటూ విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో... నిన్న‌టిదాకా ఎమ్మెల్సీగా నెట్టుకొచ్చిన లోకేశ్... ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిలో పోటీ చేసే అవ‌కాశ‌మున్నాఎక్క‌డ ఓడిపోతామోన‌న్న భ‌యంతో త‌న‌కు సేఫ్ జోన్ ఏద‌న్న విష‌యంపై నెల‌ల కొద్దీ స‌ర్వేలు చేయించుకున్న లోకేశ్... చివ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి అసెంబ్లీని ఎంచుకున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే ప్ర‌చారంలోకి దిగిపోయిన లోకేశ్... మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నార‌నే చెప్పాలి.

నిన్న‌టిదాకా ఏసీ గ‌దులు వ‌దిలి బ‌య‌ట‌కు రాని లోకేశ్... ఇప్పుడు ప్ర‌చారంలో మండుటెండ‌లోనే బ‌య‌ట తిర‌గ‌క త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో అధికార పార్టీలో నెంబ‌ర్ టూ నేత‌గా - కీల‌క మంత్రిగా ఉన్న తాను ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... లోకేశ్ కాస్తంత క‌ష్ట‌మైనా దూకుడుగానే ప్ర‌చారం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో నిన్న‌టి ప్ర‌చారంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పెద‌కొండూరులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామానికి చెందిన మ‌హిళ‌లు - రైతులు లోకేశ్ కు నిర‌స‌న తెలిపారు. టీడీపీ ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటున్న రైతు రుణ మాఫీపై లోకేశ్ ను నిల‌దీసిన అన్న‌దాత‌లు... రుణ మాఫీ ఎక్క‌డ జ‌రిగిందంటూ ఒకింత గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. అస‌లే జీపు టాపుపై నిలుచుని ప్ర‌చారం సాగిస్తున్న లోకేశ్... కింద ఉన్న రైతుల నుంచి ఈ ప్ర‌శ్న విన‌గానే షాక్ తిన్నార‌ట‌.

ఇక ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే... అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైన డ్వాక్రా మ‌హిళ‌లు కూడా లోకేశ్ కు ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించార‌ట‌. ప‌సుపు కుంకుమ పేరిట టీడీపీ స‌ర్కారు అంద‌జేస్తున్న సొమ్మును బ్యాంక‌ర్లు త‌మ అప్పుల కింద జ‌మ‌చేసుకుంటున్నార‌ని - అస‌లు ప‌సుపు కుంకుమ నిధులే త‌మ‌కు అంద‌లేద‌ని లోకేశ్ ను నిల‌దీశార‌ట‌. త‌మ ప్ర‌చారంలో కీల‌క‌మైన ఈ రెండు అంశాల‌కు సంబంధించే ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్నాస్త్రాలు దూసుకురావ‌డంతో ఏం స‌మాధానం చెప్పాలో లోకేశ్ కు అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌. ఒక్క గ్రామంలోనే ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు ఎదురైతే.. ఇక ప్ర‌చారం ముగిసేదాకా ఇంకెన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయో - వాటికి ఏం స‌మాధానాలు చెప్పి లోకేశ్ త‌ప్పించుకుంటారో చూడాలి. మొత్తంగా మంగ‌ళ‌గిరి ప్ర‌చారంలో లోకేశ్ కు చుక్క‌లు క‌నిపిస్తున్న‌ట్టుగానే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.