Begin typing your search above and press return to search.

'థాంక్యూ అయ్యర్'!

By:  Tupaki Desk   |   18 Dec 2017 11:06 AM GMT
థాంక్యూ అయ్యర్!
X
గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభం అయిన కొద్దిసేపటి తర్వాతినుంచి.. బహుశా ఈ మాట ప్రధాని నరేంద్రమోడీ మదిలో పదేపదే మెదలుతూ ఉండి ఉంటుంది. గుజరాత్ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగబోతున్నాయనే సంకేతాలు చాలా కాలం కిందటే కనిపించాయి. అందుకే భాజపా కూడా తేలిగ్గా తీసుకోలేదు. కాంగ్రెస్ చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ చెమటోడ్చి ప్రచారం చేశారు. ఇంతా చేస్తే.. అత్తెసరు పాస్ మార్కులు సంపాదించినట్లుగా.. కనీసం ప్రస్తుతం సభలో ఉన్న బలాన్ని కూడా నిలబెట్టుకోలేని దయనీయ స్థితిలో తిరిగి భాజపా గద్దె ఎక్కుతోంది. బొటాబొటీగా ఆధిక్యం నిలబెట్టుకుని.. అధికారాన్ని భాజపా వాటేసుకుంటోంది. ఆ పార్టీ మొత్తం ... కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కు బహుధా రుణపడి ఉండాల్సి ఉంటుందని.. పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే బహుశా.. మోడీ మదిలో ‘‘థాంక్యూ అయ్యర్’’ అనే మాటలు పదేపదే మెదలి ఉంటాయని కూడా జోకులు పేలుస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో మొదటి విడత పోలింగ్ ఎలా జరిగిందో గానీ.. రెండో విడత పోలింగ్ కు కొద్ది రోజుల ముందుగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ .. ప్రధాని మోడీ గురించి చేసిన వ్యాఖ్యలు.. ఓ తిరుగులేని అస్త్రంలాగా మోడీకి కలిసివచ్చాయి. మోడీని ‘నీచ్’ అని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించిన వ్యవహారం ఎంతటి దుమారంగా మారిందో అందరికీ తెలుసు. అయ్యర్ నుంచి వ్యాఖ్య వచ్చిన వెంటనే.. అది ఎంతటి నష్టం కలిగించబోతున్నదో.. కాంగ్రెస్ పార్టీ వెంటనే పసిగట్టింది. మణిశంకర్ అయ్యర్ మీద రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా పూనుకుని.. అయ్యర్ సీనియారిటీని - పార్టీతో అనుబంధాన్ని కూడా చూడకుండా.. తక్షణం సస్పెండ్ చేయించారు. అయినా అప్పటికే పరిస్థితి వారి చేయిదాటిపోయింది.

‘‘పెదవి దాటిన మాట పృథివి దాటుతుం’’దనేది సామెత! మోడీ ఆ సందర్భాన్ని చాలా చక్కగా వాడుకున్నారు. మణిశంకర్ అయ్యర్.. మోడీని నీచ్ అని అన్నారే అనుకుందాం.. కానీ.. యావత్ గుజరాత్ వాసులను నీచ్ అని అన్నట్లుగా.. గుజరాత్ లోని మొత్తం పేదలను - వెనుకబడిన కులాలకు చెందిన వారిని అందరినీ కలిపి నీచ్ అన్నట్లుగా మోడీ చాలా చక్కగా బిల్డప్ ఇచ్చారు. అతి మోడెస్టీ ప్రదర్శిస్తూ.. ‘అవును నేను నీచ్ నే’ అనే అర్థం వచ్చేలా.. ఆయన సాగించిన ప్రసంగాలు ఖచ్చితంగా కాంగ్రెస్ అవకాశాలకు గండికొట్టాయి. మొత్తానికి ఇప్పుడు మోడీ అభిమానులందరూ కూడా.. ‘‘థాంక్యూ అయ్యర్’’ అని ముక్తకంఠంతో అంటున్నారంటే.. అబద్ధం కాకపోవచ్చు!!