Begin typing your search above and press return to search.

కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు మాణికం ఠాగూర్ షాక్‌..!

By:  Tupaki Desk   |   4 July 2022 7:08 AM GMT
కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు మాణికం ఠాగూర్ షాక్‌..!
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ భారీ షాక్ ఇచ్చారా..? వారు చేసిన ఒక కీల‌క ప‌నిని వ్య‌తిరేకించారా..? రేవంత్ రెడ్డి కూడా ఠాగూర్ కే మ‌ద్ద‌తు తెలిపారా..? దీంతో పార్టీలో వ‌ర్గ విభేదాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయా..? అంటే పార్టీ శ్రేణులు అవున‌నే అంటున్నాయి.

దీనికంత‌టికీ కార‌ణం తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గ‌మే కేంద్రం అని స‌మాచారం. ఇక్క‌డి రాజ‌కీయ వ్య‌వహారాలు త‌ర‌చూ టీపీసీసీ పెద్ద‌లకు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. వీటిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఆ పార్టీ బ‌హిష్కృత నేత వ‌డ్డేప‌ల్లి ర‌వి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఈయ‌న‌ను ఇటీవ‌ల కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ పార్టీ కండువా క‌ప్పి చేర్చుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన‌ మ‌రో సీనియ‌ర్ నేత అద్దంకి ద‌యాక‌ర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ప‌ర్యాయాలు అద్దంకి ద‌యాక‌ర్ పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. దీనికి వ‌డ్డేప‌ల్లి ర‌వి కార‌ణ‌మ‌ని పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇక్క‌డి నుంచి పార్టీ టికెట్ ద‌యాక‌ర్ కు ఇవ్వ‌డంతో వ‌డ్డేప‌ల్లి ర‌వి రెబ‌ల్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గ‌ణ‌నీయ‌మైన ఓట్లు సాధించారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ అభ్య‌ర్థి గ్యాద‌రి కిశోర్ విజ‌యం సాధించారు.

దీంతో టీపీసీసీ వ‌డ్డేప‌ల్లి ర‌విని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అయితే ఇటీవ‌ల ఆయ‌న మ‌ళ్లీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో విడిగా కొన్ని కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. ఈయ‌న‌కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. ఆ ధీమాతోనే ఆయ‌న ఈసారి టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌నే యోచ‌న‌లో ఉన్నారు. ఇదే అద‌నుగా భావించిన కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా ఆయ‌నను పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే ఇక్క‌డే అస‌లైన్ ట్విస్టు నెల‌కొంది. తిరిగి పార్టీలోకి వ‌చ్చిన ర‌వి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంతును క‌లిసేందుకు ఆయ‌న నివాసానికి వెళ్ల‌గా చేదు అనుభ‌వం ఎదురైంద‌ట‌. రేవంత్ ఇంట్లో ఉన్నా కూడా ర‌విని క‌లిసేందుకు నిరాక‌రించార‌ట‌. ఎందుకంటే రేవంత్ మ‌ద్ద‌తు అద్దంకి ద‌యాక‌ర్ కు ఉండ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. పైగా పార్టీ విధానాల‌ను ధిక్క‌రించి బ‌హిష్కృత నేత‌ను చేర్చుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

దీంతో ఈ పంచాయితీ ఏఐసీసీ వ‌ర‌కు వెళ్లింది. అధిష్టానం కూడా దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌. వ‌డ్డేప‌ల్లి ర‌వి నియామ‌కం చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించింద‌ట‌. స్వ‌యంగా ఈ విష‌యాన్ని పార్టీ నేత‌ల‌కు మాణికం ఠాగూర్ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కు షాక్ త‌గిలిన‌ట్లు అయింది. ఒక్క‌సారిగా రాజ‌కీయాలు రంజుగా మారాయి. రెండు వ‌ర్గాలుగా విడిపోయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చేసారి టికెట్ ఎవ‌రిని వ‌రిస్తుందోన‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రేవంతు మ‌ద్ద‌తుతో ద‌యాక‌ర్ కు టికెట్ వ‌స్తుందా.. లేక కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ త‌మ పంతం నెగ్గించుకుంటారా అనేది వేచి చూడాలి.