Begin typing your search above and press return to search.
ఏపీకి కేంద్రం అన్యాయం!...బాబే కారణమట!
By: Tupaki Desk | 2 Feb 2018 12:59 PM GMTనిన్నటి కేంద్ర బడ్జెట్ తెలుగు నేలలో... ప్రత్యేకించి నవ్యాంధ్రప్రదేశ్ లో ఆరని చిచ్చునే రగిలించిందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన మరుక్షణమే ఏపీలో రాజకీయం వేడెక్కిపోయింది. అప్పటిదాకా బిజీబిజీగా గడుపుతున్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ... బడ్జెట్‌లో తెలుగు మాటే వినిపించని వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తదుపరి షెడ్యూల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. జైట్లీ బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో గుంటూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు.. జైట్లీ తన ప్రసంగాన్ని ముగించిన కాసేపటికే చంద్రబాబు వెలగపూడిలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చీరాగానే ఫోనందుకున్న చంద్రబాబు... ఢిల్లీలో ఉన్న తన పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న తన కేబినెట్ మినిస్టర్స్ తోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయింపులేమీ చేయని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు నెలకొన్నాయి. బాబు ప్రతిపాదనకు ఒకరో ఇద్దరో మినహా మిగిలిన మంత్రులంతా జైకొట్టేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. బీజేపీ - టీడీపీ మైత్రీ బంధం తెగిపోయినట్లేనన్నకోణంలో ఎలక్ట్రానిక్ - సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.
మొత్తంగా ఏపీకి న్యాయం చేయలేని బీజేపీతో కొనసాగడం కంటే.. ఆ పార్టీతో స్నేహాన్ని ముగిద్దామన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమైంది. అయితే ఎన్డీఏ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాలంటూ చంద్రబాబు కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా ఉన్న ఓ మంత్రి ఇప్పుడు ప్రశ్నించి చంద్రబాబుతో పాటు యావత్తు టీడీపీ నేతలకు పెద్ద సవాలే విసిరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరే ఏపీ అభివృద్దికి బీజేపీ సర్కారు కట్టుబడి ఉందని కూడా ఆయన దీమా వ్యక్తం చేశారు. అయినా ఇతర రాష్ట్రాల కంటే కూడా ఏపీకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని కూడా సదరు మంత్రివర్యులు వ్యాఖ్యానించారు. ఇంతకు ఆ మంత్రి ఎవరన్న విషయానికి వస్తే... బీజేపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పైడికొండల మాణిక్యరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే చంద్రబాబు ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీని కేంద్రం ఓ ప్రత్యేక దృష్టితోనే చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి బాబు కేబినెట్ లో మంత్రిగా ఉంటూనే... బాబు సర్కారు వాదనను తప్పుబట్టి - కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఏపీకి ఏమీ అన్యాయం చేయలేదని చెప్పిన మాణిక్యాల రావు పెద్ద సంచలనమే రేపారని చెప్పాలి. ఏపీకి నిధులు విడుదల కాకపోవడానికి కారణం... కేంద్రంలోని ఎన్డీఏ సర్కారో? ప్రధాని నరేంద్ర మోదీనో? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనో... కాదని చెప్పిన మాణిక్యాల రావు... ఏపీకి తీరని అన్యాయం చేస్తోందని చంద్రబాబేనని చెప్పేశారు. అయితే ఈ మాటను నేరుగా అనకుండా జాగ్రత్త పడిన మాణిక్యాల రావు... ఇదే అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.
అయినా మాణిక్యాల రావు నోట వచ్చిన కామెంట్లు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే.. *అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది - ఏపీని అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. డీపీఆర్ లేనందునే రాజధాని అమరావతికి నిధులు రాలేదు. కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రాలు వేరు - ఆంధ్రప్రదేశ్ వేరు అని టీడీపీ నేతలు కొందరు చెప్పడం విడ్డూరం. ఏపీకి అన్యాయం అనేది మిత్రపక్షంలోని కొందరి వాదనే. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని మిత్రపక్షం అనడం లేదు. మిత్రపక్షంలోని కొందరు నేతలు మాత్రమే అంటున్నారు. వాళ్లు బడ్జెట్ రికార్డ్స్ చూడలేదు. అందుకే అలా అంటున్నారు. పోలవరానికి సహకరిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారు. నిధులు ఆలస్యం కావు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నదే మేము. బడ్జెట్ పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఏపీని ప్రత్యేకంగా చూడటం లేదన్న టీడీపీ వాదన సరికాదు. బడ్జెట్ పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది, అలా వచ్చాక ఏపీకి ఎంత వచ్చిందో తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏపీని ప్రత్యేకంగా చూస్తున్నాం. పోలవరానికి డబ్బులు - అమరావతికి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చామా? బడ్జెట్ బాగుందని మేము ప్రజల్లోకి వెళ్లి చెప్పగలం. బడ్జెట్ లో అన్యాయం అనేది మిత్రపక్షాల వాదన కాదు - అది కొందరి వాదనే. తాడోపేడే తేల్చుకుంటామని టీడీపీలోని కొందరు నేతలు అంటున్నారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది న్యూస్ చూడగానే ఇరిటేట్ అయ్యేవారు ఉంటారు* అని మాణిక్యాల రావు తనదైన శైలిలో బాబు సర్కారును ఏకిపారేశారు.