Begin typing your search above and press return to search.

అరెస్ట్ అమిత్ షా.. తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో.. ఢిల్లీ డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:42 PM GMT
అరెస్ట్ అమిత్ షా.. తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో.. ఢిల్లీ డిప్యూటీ సీఎం
X
తెలంగాణతో పాటు దేశాన్ని ఊపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నోరు విప్పారు. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ కీలక నేతలు కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ కానీ చేయని ఎటాక్ ను మనీశ్ చేశారు.

తెలంగాణలో మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరిగింది వాస్తవమే అయితే.. అందులో అమిత్ షా పాత్ర ఉంటే ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. కేంద్ర హోం మంత్రి ఇలాంటి వ్యవహారాల్లో పాత్రధారి కావడం తీవ్ర ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

బీజేపీ డర్టీ గేమ్ అంటూ ధ్వజం

ఆపరేషన్ లోటస్ పేరిట బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల కొనుగోలు- బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడాన్ని మనీశ్ సిసోడియా డర్టీ గేమ్ గా అభివర్ణించారు. బీజేపీ ఇటీవల ఢిల్లీ, పంజాబ్ లోనూ తమ ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నాలు సాగించిందని ఆరోపించారు.

ఇప్పుడు తెలంగాణను ఎంచుకుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు మధ్యవర్తులు.. ‘షా జీ’అని పేర్కొన్నట్లు ఆడియో క్లిప్పుల్లో ఉందని.. ఆ షా జీ అమిత్ షానేనని సిసోడియా అన్నారు. కాబట్టి అమిత్ షాను అరెస్టు చేయాలని కోరారు. ఆడియో టేపుల్లో ఉన్నదాని ప్రకారం రామచంద్ర భారతి అనే స్వామీజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో కీలక పాత్ర పోషించారని మనీశ్ వ్యాఖ్యానించారు.

మనీశ్ కూడా బీజేపీ బాధితుడే..

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుపై దేశంలో ఏ నేతా స్పందించనంత తీవ్రంగా మనీశ్ సిసోడియా స్పందించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆయన నేరుగా బీజేపీ బాధితుడే కావడం దీనికి కారణం. ఆగస్టులో.. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.20 కోట్లు చొప్పున ఆఫర్ ఇచ్చి లాక్కోవాలని చూసిందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇక శుక్రవారం తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో లీకైన రెండో ఆడియోలో ఢిల్లీ ప్రస్తావన ఉండడాన్ని మనీశ్ గుర్తుచేశారు. 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను లాక్కుని ఢిల్లీ సర్కారును కూల్చనున్నట్టు అందులో ఉందని పేర్కొన్నారు. ఈ లెక్కన బీజేపీ రూ.1,075 కోట్లు పెట్టి తమ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోందని.. ఈ డబ్బంతా ఎక్కడిది? ఎవరిది? అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగాలని కోరారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.