Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల జమ లెక్క చెప్పరేం మోడీ

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:52 AM GMT
పెద్ద నోట్ల జమ లెక్క చెప్పరేం మోడీ
X
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. నవంబరు ఎనిమిదో తేదీ రాత్రి వేళ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత పలు పరిణామాలు వేగంగా సాగిపోవటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రజల వద్దనున్న పెద్దనోట్లను డిసెంబరు 30 తేదీ లోపల బ్యాంకుల్లో జమ చేయాలన్న ఆదేశాలు జారీ చేయటం.. అందుకు తగ్గట్లేదేశ ప్రజలు పెద్ద ఎత్తున పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం తెలిసిందే.

ఇదంతా బాగానే ఉన్నా.. దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో జమ అయిన పెద్దనోట్ల లెక్కల మీదనే ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల్లో జమ అయిన పెద్దనోట్ల విలువ ఎంత? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక లెక్కల్ని ఎవరూ చెప్పకపోవటం.. ప్రభుత్వ వ్యవస్థల్లో కీలకమైన ఆర్ బీఐ.. ఇప్పటివరకూ నోరు విప్పకపోవటం పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ మాటల్నే చూస్తే.. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి తాము అడుగుతున్న కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం దగ్గరకు వచ్చిన నల్లధనం లెక్కల్ని చెప్పటం లేదని.. గడిచిన 50 రోజుల వ్యవధిలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం ఎంతని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ప్రజలంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన రూ.14.86 లక్షల కోట్లు ఎవరి అధీనంలో ఉండనుందన్న ప్రశ్నను సంధించిన మనీశ్ తివారీ.. నగదు రద్దు తర్వాత ఆర్థిక ఉగ్రవాదాన్ని ఎంతవరకూ కట్టడి చేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మీదన ఉందని వ్యాఖ్యానించారు. మరీ.. ప్రశ్నకు మోడీ సమాధానం చెబుతారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం ఎంతన్న ప్రశ్నకు మోడీ సర్కారు కానీ.. ఆర్ బీఐ కానీ ఎందుకు సమాధానం చెప్పనట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/