Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ లో హిస్టరీ క్రియేట్ చేసిన హిందూ మహిళా పోలీస్

By:  Tupaki Desk   |   29 July 2022 10:30 AM GMT
పాకిస్థాన్ లో హిస్టరీ క్రియేట్ చేసిన హిందూ మహిళా పోలీస్
X
దాయాది దేశమైన పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ దేశంలో ముస్లింలకు పెద్దపీట.. మైనార్టీలుగా ఉన్న హిందువులను ఎంత దారుణంగా చూస్తారో.. వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో? వారికి తరచూ ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

అలాంటి దేశంలో తనకున్న అవరోధాల్ని దాటుకొని ఒక హిందూ మహిళా పోలీసు సాధించిన ఘనవిజయం చాలా గొప్పదని చెప్పక తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే సదరు హిందూ మహిళ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి.

చాలా..చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ ఉదంతంలోకి వెళితే.. 26 ఏళ్ల మనీషా రోపేటా పోలీసు శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకున్నారు. అలాంటి స్థాయికి చేరుకున్న తొలి హిందూ మహిళగా పాక్ లో ఆమె సంచలనంగా మారారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష్లో 468 మంది అభ్యర్థుల్లో మనీషా 16 స్థానంలో నిలవటం విశేషం.

మనీషా కుటుంబ నేపథ్యాన్ని చూస్తే.. ఆమె సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ కు చెందిన వారు. మధ్యతరగతి నేపథ్యం.. తండ్రి ఆమె పదమూడో ఏట మరణించారు.దీంతో ఆమె తల్లి వారిని కరాచీకి తీసుకొచ్చి పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారు.

పాక్ లో హిస్టరీ క్రియేట్ చేసిన మనీషా ప్రస్తుతం రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. సమాజంలో మహిళలు అణిచివేతకు గురి అవుతున్నారని.. అలాంటి వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే తాను పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. పాకిస్థాన్ లో అమ్మాయిలకు ఎక్కువగా డాక్టర్ లేదంటే టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్న మనీషా.. ‘‘పోలీసు శాఖలో కూడా మహిళల ప్రాతినిథ్యం ఉండాలన్నదే ఉద్దేశం. అందుకే పోలీసు శాఖను ఎంచుకున్నా. చిన్నతనం నుంచి నేను.. నా చెల్లెళ్లు పితృస్వామ్య వ్యవస్థను చూశాం. మహిళలకు అండగా నిలవాలని అనుకున్నా. అందుకు పోలీసు అయ్యా’’ అని పేర్కొన్నారు. ఆమె.. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.