Begin typing your search above and press return to search.

ఏటీఎంకు ద‌హ‌న సంస్కారం...మ‌న్మోహ‌న్ వ్యాసం

By:  Tupaki Desk   |   9 Dec 2016 12:23 PM GMT
ఏటీఎంకు ద‌హ‌న సంస్కారం...మ‌న్మోహ‌న్ వ్యాసం
X
పెద్ద నోట్ట రద్దుపై నిర‌స‌న‌ల ప‌ర్వం పెరుగుతోంది. ఏకంగా సౌమ్యులు సైతం త‌మ ఆగ్ర‌హం వెళ్ల‌గ‌క్కేలా... వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపేలా ప‌రిస్థితి మారిపోయింది. ఈ కోపం ఎంత వరకు వచ్చిందంటే చివరకు ఏటీఎంలకు దహన సంస్కారాలు, పిండ ప్రదానాలు చేసే వరకు వెళ్లింది. బెంగళూరులోని ఓ క్యాష్ బోర్డు ఉన్న ఏటీఎంకు పిండ ప్రదానం చేశారు. ఏటీఎం మిషన్‌కు దండవేసి, బొట్టుపెట్టి నిరసన తెలిపారు. కేంద్రం రూ.1000, రూ.500 నోట్ల ను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ ప‌నిచేయ‌ని ఏటీఎంలు ఉండ‌టంతో ఈ విధంగా చేస్తున్న‌ట్లు వారు వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా... పెద్ద నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ త‌న ప్రాథ‌మిక విధిని అవ‌హేళ‌న చేశార‌ని ఆయన విమ‌ర్శించారు. నోట్ల ర‌ద్దుపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ రాసిన వ్యాసాన్ని ఇవాళ 'ద హిందూ' ఆంగ్ల ప‌త్రిక ప్ర‌చురించింది. ఆ వ్యాసంలో మ‌న్మోహ‌న్ నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను అతి పెద్ద విషాదంగా పేర్కొన్నారు. చాలా ప‌దునైన భాష‌తో మోదీ చ‌ర్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల జీడీపీ దెబ్బ‌తింటుంద‌న్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న త‌గ్గుతుంద‌న్నారు. మునుముందు క‌ష్ట‌త‌ర‌మైన రోజులు ఉంటాయ‌న్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం భార‌తీయ వ్య‌క్తి విశ్వ‌స‌నీయ‌త‌కు తీవ్ర‌మైన గాయాన్ని చేసింద‌న్నారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య వ‌ల్ల న‌ల్ల‌ధ‌నం ఉన్న వ్య‌క్తి అతి త‌క్కువ న‌ష్టంతో బ‌య‌ట‌ప‌డుతార‌న్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో నవంబ‌ర్ 24న పార్ల‌మెంట్‌లోనూ నోట్ల ర‌ద్దుపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నోట్ల ర‌ద్దును ఓ వ్య‌వ‌స్థీకృత దోపిడీగా ఆయన వ‌ర్ణించారు. అదో న్యాయ‌ప‌ర‌మైన లూటీ అన్నారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను మ‌రింత విపులీక‌రిస్తూ మ‌న్మోహ‌న్ తాజాగా త‌న వ్యాసంలో ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ ఒక్క నిర్ణ‌యంతోనే భార‌తీయ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని దెబ్బ‌తీశార‌న్నారు. త‌మను, త‌మ డ‌బ్బును ర‌క్షిస్తుంద‌ని కోట్లాది మంది ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని విశ్వ‌సిస్తార‌ని, కానీ ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌భుత్వం వ‌మ్ము చేసింద‌న్నారు. కోట్లాది మంది విశ్వాసం కోల్పోవ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్ర పరిణామాల‌కు దారి తీస్తుంద‌న్నారు. కొత్త కరెన్సీతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే తీర్చ‌లేర‌న్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు త‌మ ద‌గ్గ‌ర వ్యూహాలు ఉన్నాయ‌ని మోదీ అనుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. గ‌త ప్ర‌భుత్వాలు న‌ల్ల ధ‌నాన్ని అడ్డుకోలేద‌న్న విష‌యంలో వాస్త‌వం లేద‌న్నారు. ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌ను ప‌ట్టుకోవ‌డం, ఉగ్ర‌వాదులు వాడే న‌కిలీ క‌రెన్సీని రూపుమాపేందుకు నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను అమ‌లు చేయ‌డం గౌర‌వ ప్ర‌దంగా భావించ‌వ‌చ్చు అని మన్మోహన్ అన్నారు. ఒక‌వేళ ప్ర‌భుత్వ మ‌ర్మం అదే అయితే దానికి త‌న పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. కానీ దేశంలో 90 శాతం మంది జీతాల ద్వారానే డ‌బ్బును సంపాదిస్తున్నార‌ని, ఎక్కువ జ‌నాభా కూడా బ్యాంకులు లేని గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో జీవిస్తుంద‌న్నారు. అలాంటి ప్ర‌జ‌లంతా పెద్ద నోట్ల‌నే త‌మ ద‌గ్గ‌ర దాచుకుంటార‌ని మ‌న్మోహ‌న్ త‌న వ్యాసంలో పేర్కొన్నారు.