Begin typing your search above and press return to search.

మౌనానికి కూడా శిక్ష... కొన్నిసార్లు తప్పదంతే!!

By:  Tupaki Desk   |   21 Jan 2015 6:38 AM GMT
మౌనానికి కూడా శిక్ష... కొన్నిసార్లు తప్పదంతే!!
X
బొగ్గు కుంభకోణం... యూపీఏ పదేళ్ల పాలనలో... వారు ప్రవేశ పెట్టిన పథకాల కంటే ఎక్కువగా వినిపించిన మాట! మిస్టర్‌ క్లీన్‌ గా పిలవబడే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చేలా చేసిన కుంభకోణం! ఈ కుంభకోణంలో ఆనాటి ప్రధాని ప్రమేయంపై ఆరా తీసేందుకు సీబీఐ ఇప్పటికి ధైర్యం చేసింది! మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించింది! బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కోకు గనుల కేటాయింపుల వ్యవహారంలో మన్మోహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఈ నెల 27న ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించాల్సి ఉండటంతో విచారణను వేగవంతం చేసింది దర్యాప్తు సంస్థ! మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి వెళ్లిన దర్యాప్తు బృందం... హిందాల్కో కేసు విషయంలో ప్రశ్నించినట్టు సమాచారం! 2005లో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయించాలని హిందాల్కో అధినేత కుమార్‌ మంగళం బిర్లా... అప్పటి ప్రధానికి రాసిన రెండు ఉత్తరాలు విషయం, ఈ కేటాయింపులకు సంబంధించిన అనేక వివరాలపైన మన్మోహన్‌ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించిందట!

నాడు యూపీఏ పాలనలో ప్రధాని మౌనంపై ఎన్నో విమర్శలు వచ్చాయి! ఆ సమయాల్లో కూడా స్వయంగా ప్రధానిని విమర్శించే సాహసం పెద్దగా ఎవ్వరూ చేసేవారు కాదు! కారణం... కేవలం పని వరకూ మాత్రమే మన్మోహన్‌ ప్రధాని! మిగిలిన కార్యక్రమాలకు అనధికార ప్రధానులు వేరే ఉండేవారు! ఈ క్రమంలో మచ్చ లేని చంద్రుడిలా వెలిగిన మన్మోహన్‌ సింగ్‌ సైతం సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కోవలసి రావడంతో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతోన్నారు! ఈ సమయంలో... అసలైన అధికారం అనుభవించిన సోనియా, రాహుల్‌, మొదలైనవారి అకృత్యాలకు ఈ మౌన మునే బలవుతారా... లేక ధైర్యం చేసి నోరువిప్పి తెరవెనుక పాత్రధారుల గుట్టు విప్పుతారా? అనేది ఇప్పుడూ ఆసక్తి కరంగా మారింది!

యూపీఏ హయాంలో జరిగిన చాలా కుంభకోణాల్లో చిదంబరం హస్తం కూడా పుష్కలంగా ఉందనే విమర్శలు అప్పట్లో చాలానే వచ్చాయి! ఈ క్రమంలో... మన్మోహన్‌ మౌనం వీడి నిజాలు చెబితే మాత్రం... వీరందరూ ఆత్మకథలు రాసుకోవడానికి కావలసినంత సమయం శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో పుష్కలంగా దొరుకుతుందని విశ్లేషకుల అభిప్రాయం!